అమరావతి:
అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేస్తూ, దీనిని చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి సుమారు 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఈ త్యాగాలకు న్యాయం జరిగే దిశగా ఈ బిల్లు ఆమోదం కీలకమైన అడుగని అన్నారు. గతంలో రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపిందని వ్యాఖ్యానించారు.
రాజధాని కోసం రైతులు, మహిళలు 1600 రోజుల పాటు నిరంతర పోరాటం సాగించారని, ఆ ఉద్యమానికి తన సెల్యూట్ అని మంత్రి తెలిపారు. ఆ సమయంలో మహిళలపై కూడా జరిగిన దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలిచాయని విమర్శించారు.
మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన గత ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుబట్టారు. ఎన్నికల ముందు అమరావతి గురించి హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన వైఖరిని ప్రజలు గమనించారని అన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని తెలిపారు.
అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా తెలుగుజాతి గౌరవం, రైతుల త్యాగాల ప్రతీక అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రానికి సువర్ణ భవిష్యత్ సిద్ధమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.