Take a fresh look at your lifestyle.

వట్టిపోతున్న బావులు, బోర్లు -ఎండిపోతున్న పంట పొలాలు

  • కళ్ళముందే పంట పొలాలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు
  • అరకోరగా వస్తున్న గోదావరి జలాలు- ఖాళీ అయిన చెరువులు కుంటలు
  • పడిపోయిన భూగర్భ జలమట్టం
  • తక్షణమే గోదావరి జలాలతో పంట పొలాలను కాపాడాలని కోరుతున్న రైతాంగం

తుంగతుర్తి , ముద్ర: ఆరుగాలం కష్టించి వరి నాట్లు వేసి సుమారు రెండు మూడు నెలలు అర కొర నీటితో పంట పొలాలను కాపాడి తీరా వరిచేలు కళ్ళముందే పొట్టదశలో,కంకి దశలో ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి.గత సంవత్సరంనర క్రితం వరకు నిరాఘాటంగా వచ్చిన గోదావరి జల్లాలు నేడు అరకొరగా వారబందీ విధానంతో వస్తుండడంతో గ్రామాల్లోని చెరువులు కుంటలు ఎండి పోయాయి.చెరువులు కుంట లలో నీటి మట్టం తగ్గిపోవడంతో బావులు బోర్లు ఎండిపోయాయి.కాలువల వెంట నాట్లు వేసిన రైతులు కాలువల్లో నీరు రాకపోతుందా అనే ఆశతో ఎదురుచూసి చూసి తీరా పది రోజులకు ఒకసారి కంటి తుడుపుగా వస్తున్న గోదావరి జల్లాలు పొలాలు తడవకముందే ఆగిపోతుండడంతో రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.వందలాది ఎకరాల వరి పంట ఎండిపోయే ప్రమాదంలో పడింది.ఒకపక్క అడుగంటుతున్న భూగర్భ జలాలు మరోపక్క అరకొరగా వస్తున్న గోదావరి జల్లాలు రైతుల పాలిట శాపంగా మారాయి.ఏ రైతును కదిలించిన పొలాలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు తప్ప మరో మాట చెప్పడం లేదు.బావులు బోర్లు ఎండిపోతున్నాయి అని మాట సర్వత్రాభిన వస్తుంది.గత ఐదారు సంవత్సరాలలో కానరాని బోర్ బండ్లు నేడు గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి.వందలాది ఫీట్ల బోర్లు వేసి చుక్క నీరు రాక వేలాది రూపాయలు నష్టపోతున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తుంగతుర్తి ప్రాంతం అనాదిగా కరువు కాటకాలతో అల్లాడి గోదావరి జలాల రాకతో ఐదు ఆరు సంవత్సరాలు బీడు భూములన్నీ పంటపొలాలుగా మారిన తరుణంలో తమకు ఏ విధమైన కష్టాలు ఉండవని తలచిన రైతులకు ఒక్కసారిగా గోదావరి జల్లాల రాక అరకొరగా మారడంతో తిరిగి కరువు కోరల్లో తుంగతుర్తి నియోజకవర్గం చిక్కుకోనుందని మాట సర్వత్ర విన వస్తోంది.వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వరి పంట వేసిన అన్నదాత ఆక్రందనలు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆలకించి గోదావరి జలాలను వదిలితే పోగా మిగిలిన పంటలు అన్న దక్కుతాయని రైతన్నలు ఆశపడుతున్నారు.ఒకపక్క రుణమాఫీ కాక మరొక రైతు భరోసా రాక కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో తీరా నాట్లు పెట్టిన పొలాలు కూడా ఎండిపోతుండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పాలకులు తక్షణమే స్పందించి రైతుల గోడు పట్టించుకోవాలని గోదావరి జలాలను తక్షణమే విడుదల చేయాలని యావత్ రైతాంగం కోరుతోంది.

1. తుంగతుర్తి మండల కేంద్రం సమీపంలో ఎండిపోయిన పంట పొలం


2. భూగర్భ జలాలు అడుగంటి వట్టిపోయిన బావి


3. ఇంకా ఒకటి రెండు రోజుల్లో ఓట్టి పోవడానికి సిద్ధంగా ఉన్న వ్యవసాయ బోరు కొద్దిపాటి నీరు పోస్తున్న దృశ్యం

Leave A Reply

Your email address will not be published.