Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో అసమర్థ పాలన

  • కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు.
  • కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా.. కమీషన్లు లాగుతున్నారు.
  • పెన్షన్లు కూడా ఇవ్వలేని స్ధితిలో సర్కార్.
  • తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి.
  • మీడియాతో మల్కాజిగిరి ఎంపీ ఈటల.

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం రాజ్యమేలుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని చెప్పారు.సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.10 నుంచి రూ.20 లక్షల మధ్య పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చి 16నెలలు పూర్తయినా ఇప్పటికీ చెల్లించలేదని మండిపడ్డారు.పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు కమీషన్ తీసుకోవడం దారుణమన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని చురకలంటించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదించేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.వృద్ధాప్య, దివ్యాంగులకు కొత్త పెన్షన్ల విషయం దేవుడెరుగు అన్నారు.రాష్ట్రంలో పాత పెన్షన్లు రద్దు చేయడమే తప్ప కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని విమర్శించారు.కల్యాణలక్ష్మీ చెక్కులు పెళ్లి పందిరిలో ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు పిల్లలు పుట్టినా కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందడం లేదని అన్నారు.ఇండ్లు కట్టినా, రోడ్లు వేసినా, డ్రైనేజీలు నిర్మించినా, పెన్షన్లు ఇచ్చినా ఇవన్నీ ప్రజల పన్నుల డబ్బులతోనే జరుగుతున్నాయని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత జాగీరు లాగా చూపించకూడదని చెప్పారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయి రైతులు నష్టంతో కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రం నిధులతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అయినా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు కేంద్రంపై నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఈటల ఆరోపించారు. మోదీ కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్నారని చెప్పారు. 60 శాతానికి పైగా అధికార బాధ్యతలను కేంద్రం బడుగు బలహీన వర్గాలకే అప్పగించిందన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలా లేదని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈటల చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.