హిమంత బిశ్వ శర్మ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
ముద్ర, హైదరాబాద్ :
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ముస్లింల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా సీఎం శర్మ వ్యవహరిస్తున్నారని ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హిమంత బిశ్వ శర్మ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా, పత్రికలు, బహిరంగ సభల ద్వారా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఇవి మరింత తీవ్రమయ్యాయని ఒవైసీ ఆరోపించారు. ఈ నెల 7వ తేదీన అస్సాం బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను ఒవైసీ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. అందులో ముఖ్యమంత్రి శర్మ తుపాకీ పట్టుకుని, ముస్లింలుగా చిత్రీకరించబడిన వ్యక్తులపైకి గురిపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు ఉందని పేర్కొన్నారు. “పాయింట్ బ్లాంక్ షాట్”, “నో మెర్సీ” (కరుణ లేదు) వంటి పదజాలంతో కూడిన ఆ వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందని విమర్శించారు. ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో పోలీసులు స్వచ్ఛందంగా చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఒవైసీ గుర్తుచేశారు. ఈ వీడియో జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉందని ఆయన వాదించారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ వీడియో ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉందని, తక్షణమే సీఎం హిమంత బిశ్వ శర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒవైసీ పోలీస్ కమిషనర్‌ను కోరారు.