Take a fresh look at your lifestyle.

వ్యవసాయం…విజ్ఞానం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

సూర్యాపేట పర్యటనలో అభివృద్ధి పనులకు శంకుస్ధాపన
రైతులు, విద్యార్ధులతో ముఖాముఖి

వ్యవసాయం ఒక విజ్ఞానమని” ఇప్పటివరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ,జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి లో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు,అధికారులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికరు. వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద వంద ఎకరాల్లో రూ. 150 కోట్లతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేశారు. కోదాడ సమీపంలో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయం, మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రూ. కోటితో యాత్రికా సదన్, నూతన కిచెన్ షెడ్ కు, రూ. కోటితో నిర్మించతలపెట్టిన డార్మెటరీ భవనాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడారు. వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం సౌభాగ్యమన్నారు. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ కాలేజీ, విద్యార్థులకు ఉపయోగపడే నవోదయ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. గంగ ,యమునా, సరస్వతి లాగే
కృష్ణ, గోదావరి, కావేరి నదులు ఉండడం, మట్టపల్లిలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేయడం, ప్రత్యేకించి పామాయిల్ పెంపకం చేపట్టడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ రైతులకు రూ. 2.47కోట్లు విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాల ప్రోసీడింగ్స్ పంపిణీ చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ. 504 కోట్లు, ఆదాయ వనరుల ను పెంపొందించేందుకు మరో రూ. 89 కోట్ల చెక్కులు అందజేశారు.

నదీ జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షిస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ… నీటి వాటా సాధన కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సహా మరెవరైనా సరే తెలంగాణ హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే గట్టిగా ప్రతిఘటిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రూ. 50 లక్షలతో తెలంగాణ-ఏపీల మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించినట్లు గుర్తు చేశారు. యాత్రికుల సౌకర్యార్థం భవిష్యత్తులో రూ. 80 కోట్లతో హుజుర్నగర్-మట్టపల్లి రహదారి విస్తరణ పనులతో పాటు ఆలయ సన్నిధిలో డార్మిటరీ, వంటశాలా నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. చరిత్రాత్మక లక్ష్మీ నరసింహ స్వామి ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమడింప చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్,శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్.పి నరసింహ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.