ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూ. 104 కోట్ల 94లక్షల 74 వేలు ఆమోదించారు. చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ అధ్యక్షతన బడ్జెట్, సాధారణ మున్సిపల్ సమావేశం జరిగింది. ఖర్చులు వంద కోట్ల 4 లక్షల 73 వేలుగా నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సుమారు 88.24 కోట్ల రూపాయలు అధికంగా నిధులు సమకూరుతాయన్న అంచనాలను రూపొందించారు. వివిధ గ్రాంటుల ద్వారా యూఐడీఎఫ్ కింద 18.70 కోట్లు, టీయూఎఫ్ఎడీసీ 37.50 కోట్లు, ఎల్డీఎఫ్ కింద రూ. 29.10 కోట్లు, ఎస్ఎఫ్సి కింద రూ. 2.16 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా కోటి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల గ్రాంట్ల ద్వారా రూ.84 లక్షలు, ఎస్ఆర్ఎఫ్ ద్వారా రూ. 20 లక్షలు ఈసారి సమకూరే అవకాశముందని బడ్జెట్లో పొందుపర్చారు.

బడ్జెట్‌లో పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం సమావేశంలో కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రోడ్ల దుస్థితి, డ్రైనేజ్ వ్యవస్థలో లోపాలు, తాగునీటి సమస్యలు, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలను సభ్యులు బట్టి ఉదయ్ కుమార్, మామిళ్ళ ఆంజనేయులు, జుబేర్ అహ్మద్, శృతి, సోహాయల్, లక్ష్మీ స్వరాగిణి, కొటాల లలిత, శంసున్నిసా బేగం తదితరులు ప్రస్తావించారు. చైర్‌పర్సన్ రాధిక స్పందిస్తూ కౌన్సిలర్లు సూచించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని ఆమె విజ్ఞప్తి చేశారు.
వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.