సర్కార్ కు వెలుగుమట్ల బాధితుల ఉసురు తగులుతుంది
బాధిత మహిళల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది
రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడం దారుణం
ఖమ్మంలో జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన
పోలీసులు, బాధితుల మధ్య తోపులాట, కవిత అరెస్ట్
ముద్ర, ఖమ్మం:

వెలుగుమట్ల లో బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేసిన ప్రభుత్వానికి, నాయకులకు బాధిత మహిళల ఉసురు తగులుతుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సోమవారం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. వెలుగుమట్లలో బాధితుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. ఎగ్జామ్స్ సయమంలో పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయటం ఆవేదన కలిగించిందన్నారు. బాధితుల ఆవేదన కొంతమంది రాజకీయ నాయకులకు ఎగ్జిబిషన్ మాదిరిగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మీ ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పాపాలు కడుక్కునే ప్రయత్నంలో బాధితులకు భోజనం పెడుతున్నారన్నారు. తాను ఎక్కడున్న సరే మహిళలు, పేదల పక్షాన ఉంటానని అన్నారు. వెలుగుమట్ల బాధితుల సమస్య పరిష్కారం అయ్యేవరకు వారి పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. విశారదన్ మహారాజ్ గారితో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ప్రజా సంఘాలు కూడా బాధితులకు మద్దతుగా ఉన్నారన్నారు. అందరం కలిసి వెలుగుమట్ల బాధితుల సమస్య పరిష్కారమయ్యే వరకు వదలమని చెప్పారు. ముఖ్యమంత్రి సహా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బాధితుల ఇళ్లు కూల్చిన చోటే వారికి కొత్త ఇళ్లు కట్టించాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదల మీద జులుం నడుస్తోందని…వారి ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపుతూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆ రాజ్యాంగాన్ని కూనీ చేసేలా పేదల మీదకు బుల్జోజర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామన్నారు.
జెడ్పీ సెంటర్ లో ఆందోళన
అంతకుముందు వెలుగుమట్ల బాధితులను కవిత గారు పరామర్శించారు. ఆ తర్వాత వెలుగుమట్ల బాధితులతో కలిసి కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్తూ జెడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి వెలుగుమట్ల బాధితులకు అదే స్థలంలో ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మం ఆర్ డీవో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు ఓవరాక్షన్ కు దిగారు. జాగృతి నాయకులు, వెలుగుమట్ల బాధితులు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులను దుర్భాషలాడుతూ తోసేశారు. విచక్షణరహితంగా వ్యవహరిస్తూ వారిపై బలప్రయోగం చేసిన పోలీసులు కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ సహా జాగృతి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు గాయపడగా…మరికొందరు సొమ్మసిల్లిపడిపోయారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించాలని కవిత డిమాండ్ చేశారు. అరెస్టు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు. దీంతో పోలీసుల తీరుపై జాగృతి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ కానిస్టేబుళ్లు లేకుండా మహిళలను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మహిళల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని జాగృతి నాయకులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.