Take a fresh look at your lifestyle.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే టీబీజేపీ అధ్యక్ష ఎంపిక

  • ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియ
  • సామాజిక సమీకరణ కోణంలో నిర్ణయం
  • బీసీ నేతకు పార్టీ పగ్గాలు కట్టబెట్టే అవకాశం
  • మిషన్ 2028 టార్గెట్ గా అధ్యక్షుడి ఎంపిక

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికపై ఆ పార్టీ కేంద్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీ బీజేపీ అధ్యక్షుడి నియామకం పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధీటైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. సామాజిక సమీకరణ కోణంలో పార్టీ నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించింది.

అసెంబ్లీ 8 స్థానాలు, లోక్ సభ 8 స్థానాలు దక్కించుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. దీంతో ”మిషన్ 2028 టార్గెట్” గా చేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ టీపీసీసీ పీఠాన్ని బీసీలకు అప్పగించింది. బీఆర్ఎస్ బీసీ నినాదాన్ని మోస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్ల బీసీ వర్గాల్లో సానుభూతి పెరగడం గమనార్గం. బీజేపీ కూడా తప్పనిసరి పరిస్థితిలో బీసీ నేతకే పార్టీ పగ్గాలను అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతోన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందు బూత్, మండల, జిల్లా స్థాయి అధ్యక్షుల ఎన్నికలు జరగాల్సివుంది. ఇప్పటికే బూత్, మండల స్థాయి అధ్యక్షుల ఎన్నికను పూర్తి చేసింది. జిల్లా స్థాయి అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాతే టీబీజేపీ అధ్యక్షుడి ఎంపిక జరగనుంది.

ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియ

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతల్లో భారీగా పోటీ నెలకొంది. బీసీ కోటాలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ , పార్టీ సీనియర్ నేత ఆచారి పోటీలో ఉండగా, ఓసీ కోటాలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో ఎంపీ ఎం. రఘునందన్ రావు, ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో 2028 లో బీజేపీని అధికారంలోకి తీసుకురాగల సత్తా ఉన్న నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించాలని కేంద్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రంలో బీసీ వర్గాలు అధికంగా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణ లెక్కల్లో బీసీలకే పార్టీ పగ్గాలు అప్పగించాలంటే ముందువరసలో ఎంపీ ఈటల రాజేందర్ పేరు వినిపిస్తుంది. కేసీఆర్ ను ఎదిరించిన నేతగా, తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా ఈటల రాజేందర్ మంచి పేరు ఉంది.

గతంలో బీసీ కోటాలో మున్నూరుకాపు వర్గానికి చెందిన బండి సంజయ్ కు పార్టీ అధ్యక్షపదవి ఇచ్చారు కాబట్టి ఈసారి ముదిరాజు వర్గానికి చెందిన ఈటల వైపు పార్టీ కేంద్రనాయకత్వం మొగ్గుచూపుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే అధ్యక్ష పదవి కోసం గట్టిగా పట్టుబడుతోన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు పార్టీ అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. పార్టీలో దుకుడుగా ఉండే నేతగా, యువత ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఎంపీ అర్వింద్ కు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవంటున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు జాతీయ పసుపుబోర్డు ఛైర్మన్ పదవి దక్కిన నేపథ్యంలో ఆ జిల్లా నుంచి అర్వింద్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి దక్కకపోవచ్చని బీజేపీలో చర్చ జరుగుతోంది. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మొదట్నుంచీ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది.

ఇక ఓసీ కోటాలో ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షపదవిపై ఆశపెట్టుకున్నారు. పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న రఘునందన్ రావుకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటంతో పాటు అవకాశమొచ్చినప్పుడల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఏకిపరేస్తున్నారు. ఎంపీ డీకే ఆరుణ కూడా మహిళా కోటాలో తనకు రాష్ట్ర అధ్యక్షపదవి దక్కవచ్చేనే ఆశలో ఉన్నారు. ఏబీవీపీ నేపథ్యం ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు మొదట్నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. సౌమ్యుడిగా పార్టీలో మంచి పేరు ఉంది. మునుగోడుకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూడా పార్టీ అధ్యక్షపదవిపై ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం వద్ద అధ్యక్ష పదవి కోసం ఎవరి లాబీయింగ్ వారు చేస్తోన్నారు. అయితే పార్టీ ఎవరికి మొగ్గు చూపుందో వేచిచూడాలి.

Leave A Reply

Your email address will not be published.