పబ్లిక్ వర్క్స్ టు పబ్లిక్ వెల్ఫేర్ – ఎస్కీ ఐలో మధ్యప్రదేశ్ పీడబ్ల్యూడీ ఇంజనీర్లకు శిక్షణ ప్రారంభం
ముద్ర ప్రతినిధి:
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే ప్రతి పని ప్రజల సంక్షేమానికే అన్న దృక్పథంతో పనిచేయాలని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI)లో సోమవారం (ఏప్రిల్ 6, 2026) ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఫిబ్రవరి 12, 2026న భోపాల్‌లో ESCIతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం ప్రకారం తొలి బ్యాచ్‌గా 29 మంది ఇంజనీరింగ్ అధికారులు శిక్షణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ESCI డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వరరావు మాట్లాడుతూ, తమ సంస్థపై విశ్వాసం ఉంచిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీతనం కలిగిన ఇంజనీర్లుగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ లక్ష్యమన్నారు.
సివిల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణలో ఆర్కిటెక్చర్ ప్లానింగ్, మోడరన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలు, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (BIM), మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అంశాలపై నిపుణులు డాక్టర్ ఎస్.పి. అంచూరి, డాక్టర్ వెంకట దిలీప్ కుమార్ పసుపులేటి వివరించారు.
వచ్చే శుక్రవారం వరకు కొనసాగే ఈ శిక్షణలో అడ్వాన్స్డ్ BIM కాన్సెప్ట్‌లు, 3డీ మోడలింగ్, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ప్రీకాస్ట్ కాంక్రీట్, హై రైజ్ నిర్మాణాలు, 3డీ ప్రింటింగ్, సైట్ ప్లానింగ్, స్పేస్ ప్లానింగ్, ఎనర్జీ ఎఫిషియంట్ గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్ వంటి అంశాలపై సీనియర్ ఇంజనీర్లు బోధన అందిస్తున్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా అధ్యక్షుడు మనీష్ మహేంద్ర కొఠారి కలకత్తా నుండి ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అత్యుత్తమ శిక్షణ అందిస్తామని తెలిపారు.
మధ్యప్రదేశ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ భగవత్ ప్రసాద్ బౌసారియా మాట్లాడుతూ, ప్రతి వారం కొత్త బ్యాచ్‌లను ESCIకి పంపించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ESCI విభాగాధిపతులు, ఫ్యాకల్టీ సభ్యులు, కోర్సు డైరెక్టర్ డాక్టర్ ఆర్. వెంకటరెడ్డి, ఫ్యాకల్టీ సభ్యులు సి.హెచ్. తిలక్, సునీత తదితరులు పాల్గొన్నారు.