Take a fresh look at your lifestyle.

కరీంనగర్ డెయిరీ చైర్మన్ సి.హెచ్. రాజేశ్వర్‌రావుకు అమెరికా డాక్టరేట్

ముద్ర, కరీంనగర్, జూలై 20 : తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తి చేసే రైతుల ఆర్థిక సాధికారత, సహకార డెయిరీ రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (కరీంనగర్ డెయిరీ) చైర్మన్ సి.హెచ్. రాజేశ్వర్‌రావుకు అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ (USA) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. పాడి పరిశ్రమలో ఆయన అందించిన విశేష సేవలు, రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.

న్యూఢిల్లీలోని లోధి రోడ్‌లో ఉన్న ఇండియా హ్యాబిటాట్ సెంటర్లోని గుల్మోహర్ హాల్లో జూలై 19న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై రాజేశ్వర్‌రావును అభినందించారు.

CH Rajeshwar Rao

రైతు సంక్షేమమే లక్ష్యంగా…

వ్యవసాయ పట్టభద్రుడైన రాజేశ్వర్‌రావు, రైతులకు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను స్థిరమైన అదనపు ఆదాయ వనరుగా తీర్చిదిద్దేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. శాస్త్రీయ పద్ధతుల్లో పాల ఉత్పత్తి, పశుసంవర్థకంపై అవగాహన కల్పించడం, పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ధరలు అందేలా చర్యలు తీసుకోవడం, సహకార వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారు.

తెలంగాణలో అగ్రగామిగా కరీంనగర్ డెయిరీ

రాజేశ్వర్‌రావు నాయకత్వంలో కరీంనగర్ డెయిరీ తెలంగాణలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన సహకార డెయిరీ సంస్థగా గుర్తింపు పొందింది. పాలు, పాల ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, విక్రయాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక కొత్త పాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చి సంస్థ మార్కెట్ పరిధిని విస్తరించారు. ప్రస్తుతం లక్ష మందికి పైగా రైతులు కరీంనగర్ డెయిరీకి ప్రతిరోజూ పాలను సరఫరా చేస్తున్నారు.

12 వేల లీటర్ల నుంచి 3 లక్షల లీటర్ల సామర్థ్యానికి…

1971లో కేవలం 12 వేల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ప్రారంభమైన కరీంనగర్ డెయిరీ, నేడు నుస్తులాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని అత్యాధునిక మెగా డెయిరీతో రోజుకు 3 లక్షల లీటర్లకు పైగా పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని చేరుకుంది. రైతుల సంక్షేమం, పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంపు కోసం అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

 

పురస్కారాల పరంపర

గౌరవ డాక్టరేట్‌తో పాటు రాజేశ్వర్‌రావు అనేక జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు.

2026 – అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు
2020 – ఇండియా డెయిరీ అవార్డు (ఉత్తమ మధ్య తరహా సంస్థ)
2019 – ది హన్స్ ఇండియా అవార్డు (డెయిరీ రంగంలో ఉత్తమ రిటైలర్)
2018 – ఇండియన్ అగ్రికల్చర్ అవార్డు (ఉత్తమ నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు)
2017 – కరీంనగర్ లయన్స్ క్లబ్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు
2016 – ఐసీఏఆర్ (ICAR) ఉత్తమ రైతు అవార్డు
2014 – ఆచార్య ఎన్.జి. రంగా కిసాన్ సంస్థ ఉత్తమ సామాజిక సేవా అవార్డు
2010 – డాక్టర్ సి. కృష్ణారావు ఉత్తమ సేవల అవార్డు
తెలంగాణకు గర్వకారణం

మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం ద్వారా కరీంనగర్ డెయిరీతో పాటు తెలంగాణ పాడి పరిశ్రమకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించిందని రైతులు, డెయిరీ వర్గాలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంక్షేమం కోసం రాజేశ్వర్‌రావు చేసిన కృషికి ఈ గౌరవం నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.