Take a fresh look at your lifestyle.

నేత కార్మికులను ఆదుకోండి,…… ఆర్ధిక శాఖ మంత్రి భట్టికి కేటీఆర్ విజ్ఙప్తి

రూ.38 కోట్ల విద్యుత్ భారం, సర్ ఛార్జీలను మాఫీ చేయండి
నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఆర్థిక కష్టాల నుంచి నేతన్నలను గట్టెక్కించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఙప్తి చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని పవర్ లూమ్ పరిశ్రమపై పడుతున్న విద్యుత్ భారాలను తొలగించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన భట్టి విక్రమార్కను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. అందులో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న సుమారు రూ.38 కోట్ల విద్యుత్ భారంతో పాటు, పేరుకుపోయిన బ్యాక్ బిల్లింగ్, సర్‌ఛార్జ్‌లను తక్షణమే మాఫీ చేయాలని కోరారు. గతంలో ఉన్న విధంగానే పరిశ్రమకు నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని విజ్ఙప్తి చేశారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా నేతన్నలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం ఉందని, వారికి తక్షణమే ఆర్థిక వెసులుబాటు కల్పించి భరోసా ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలను కేటీఆర్ వివరించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్యుత్ బకాయిల అంశాన్ని పరిశీలించి, కార్మికులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.