- కల్లు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు జర్మనీ పారిశ్రామికవేత్త ఆంగీకారం.
- మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎంతో భేటీ అయిన ప్రతినిధులు.
- తాటి, ఈత చెట్ల కల్లు నుంచి వైన్ అండ్ అరక్ తయారీ పరిశ్రమ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వైన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు జర్మనీ కంపెనీ సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ పారిశ్రామికవేత్త స్టీఫెన్ భేటీ అయ్యారు. తాటి, ఈత చెట్ల నుండి వచ్చే కల్లుతో వైన్ అండ్ ఆరక్ తదితర అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జర్మన్ ప్రతినిధి స్టీఫెన్.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఫ్రొఫెసర్ జానయ్య కాంబోడియా స్టడీ టూర్ వెళ్ళినపుడు అక్కడ ఈ పరిశ్రమ ఎంతో ఆర్థికంగా ఉపాధి కల్పిస్తుండడంతో తెలంగాణ లో కూడా పరిశ్రమ ఏర్పాటు కు స్టీఫెన్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తి మేరకు తెలంగాణ లో కల్లు ఆధారిత పరిశ్రమల్లో భాగంగా తాటి ఈత చెట్ల నుండి వైన్ అండ్ ఆరక్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియజేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణములో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన స్టీఫెన్ ఈ పరిశ్రమ తెలంగాణాలో ఏర్పాటు చేయడం వల్ల గీత కార్మికులు వృత్తి పరమైన ఆర్థికాభివృద్ధిని పొందడమే కాకుండా, వాల్యూ అడిషన్, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అయన వివరించారు. తెలంగాణ కల్లు యూరప్ కి ఎగుమతి స్థానికంగా కల్లు దుకాణాల ఏర్పాటు.. గీత కార్మికులకు కనీసం ఆదాయం పెంపుదల ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు మార్కెటింగ్ విస్తరణ తో పాటు రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ విభాగం ఏర్పాటు చేయడం, తాటి ఈత మొక్కలు త్వరగా పెరిగి అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల తయారుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు.