- పీఓడబ్లూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి హెచ్చరిక.
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: ఏ ఏడాది మేలో హైదారాబాదులో జరప తలపెట్టిన ప్రపంచ సుందరి పోటీలను బహిష్కరిస్తామని ప్రగతిశీల మహిళా సంఘం( పీఓడబ్లూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి హెచ్చరించారు. మంగళవారం ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం గోకినపల్లి లలిత అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో శిరోమణి మాట్లాడుతూ ఈ పోటీలను హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే తెలంగాణ టూరిజం హెరిటేజ్, సాంస్కృతిక శాఖ ప్రకటించిందని, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రదర్శనకు కోట్లాది రూపాయలను కేటాయిస్తూ ఇది రాష్ట్రానికి లాభదాయకమని దండోరా వేస్తోందన్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రాధాన్యత నిచ్చే, మహిళలను తల్లిగా చెల్లిగా గౌరవించే ఈ దేశంలో అర్ధ నగ్నంగా అంగాంగం కొలిచి సౌందర్యవతులుగా ప్రకటించే మిస్ వరల్డ్ పోటీలను ఈ దేశ మహిళలు ఎంత మాత్రం సహించరని, ఇది ఇక్కడి మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుండన్నారు. ఈ అందాల పోటీల మీద పెట్టే కోట్లాది రూపాయల ఖర్చుతో గ్రామీణ హాస్టల్లో, పాఠశాలల్లో మంచినీళ్లు, టాయిలెట్లు, విద్యా వైద్య సౌకర్యాలను మెరుగు పర్చవచ్చన్నారు. మహిళలు, యువతకు వ్యాయామశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయవచ్చని, పనిలో శిక్షణనిచ్చి పని నైపుణ్యాలను పెంచవచ్చని సూచించారు.మహిళలను అంగడి బొమ్మలను చేసి, అందంగా ప్రదర్శనలు చేయించడం కాదు, ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా శిరోమణి గుర్తు చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, నానాటికి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పేటలోని ఒక ఆలయ సమీపంలో మహిళపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల మంగతాయి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సన్న బియ్యం తో పాటుగా12 రకాల నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేసారు.ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తుడుము ఝాన్సీ, జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాపనేని శోభ, పరిమళ, లలిత, సరోజిని, చైతన్య తదితరులు పాల్గొన్నారు.