Take a fresh look at your lifestyle.

నేడు రెసిడెన్షియల్ పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

జిల్లాలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం (అర్ బిఎస్కె) టీవీవీపీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విస్తృత స్థాయిలో నేడు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.ఈకార్యక్రమంలో
సదాశివపేట మండలం లింగంపల్లి టీఎస్‌ఆర్‌ఈఐఎస్, కేజీబీవీ, సంగారెడ్డి టీఎస్‌ఆర్‌ఈఐఎస్,కల్హేర్ మినీ గురుకులం,టిడబ్ల్యుఆర్‌ ఈఐఎస్ నాగల్ గిద్ద,టీఎంఆర్‌ఈఐఎస్ పటాన్చెరు,ఇస్నాపూర్, అల్గోల్,కేజీబీవీ రాయికోడ్, అందోల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య బృందాలు విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈశిబిరాల్లో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి,చెవి,దంత సంబంధిత సమస్యలు, పోషకాహార లోపాలు వంటి వ్యాధులను గుర్తించి తక్షణ చికిత్స అందించడంతో పాటు, అవసరమైతే ఉన్నత వైద్య సేవలకు రిఫర్ చేయనున్నట్లు తెలిపారు.విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా మార్చి 26న సంగారెడ్డి పట్టణంలోని మార్కెస్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూ పి హెచ్ సి)లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈశిబిరంలో నిపుణులైన వైద్యులు వివిధ వ్యాధులపై పరీక్షలు నిర్వహించి నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.