- సైబర్ మోసాలు పెరుగుతున్నాయి.
- బ్యాంకు మేనేజర్ల పాత్రపై హైకోర్టు సీరియస్.
- ఆర్బీఐ నిబంధనలు పాటించరా..?
- బ్యాంకు మేనేజర్‌కు నోటీసులు.
- అకౌంట్లలో డబ్బులు కాపాడలేకపోయారంటూ మేనేజర్లపై ఆగ్రహం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సైబర్ నేరాల కేసుల్లో హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. సైబర్ మోసాలు జరుగుతుంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. ఒకే రోజు ఒకే అకౌంట్ కు దాదాపు 5 కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ అవుతుంటే మేనేజర్లు ఏం చేస్తున్నారని మండిపడింది.సైబర్ మోసాలపై బ్యాంకుల పాత్రపై గురువారం హైకోర్టు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.ఇటీవల ఒకే ఖాతాకు ఒక్కరోజులోనే రూ.5 కోట్లు బదిలీ కావడంపై బ్యాంకర్లను ప్రశ్నించింది. కేరళలోని ఎర్నాకుళం ఎస్బీఐ బ్యాంక్ కీజ్మాడ్ శాఖపై తెలంగాణ హైకోర్టు ఆరా తీసింది.సైబర్ నేరగాళ్లు అమాయకుల అకౌంట్లనుంచి అంత మొత్తంలో కొల్లగడుతుంటే బ్యాంకు మేనేజర్ ఏం చేస్తున్నారని మండిపడింది.ఈ సందర్భంగా బ్యాంకులో కరెంట్ అకౌంట్స్ తెరిచేందుకు ఆర్బీఐ నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. ఆర్బీఐ నిబంధనలను పాటించారో లేదో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎన్వీ శ్రావణ్ కుమార్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో వరవరావు అనే వ్యక్తి 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అదే రోజు భారత్ ఎంటర్ ప్రైజెస్ ఖాతాలోకి ఒకే రోజు 5 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. చాలా మంది బాధితుల నుంచి ఒకేరోజు రూ. 5 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అకౌంట్లో డబ్బు డిపాజిట్, విత్ డ్రా విషయంలో బ్యాంకు మేనేజర్ వైఫల్యం చెందారని హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.