అమరావతి :
రాష్ట్రంలో బాలల భద్రత, హక్కుల పరిరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని బాలల పై జరుగుతున్న లింగ ఆధారిత హింస ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతున్న నేపథ్యంలో, దీనిని అరికట్టేందుకు సమాజంలో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం అత్యంత అవసరం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ వేటుకూరి ఏ వి ఎస్ ఎస్ రాజు అన్నారు. హెల్ప్ సంస్థ రూపొందించిన “బాలల పై జరుగుతున్న లింగ ఆధారిత హింసను అర్థం చేసుకోవడం మరియు ఎదుర్కోవడం” అనే పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ వేటుకూరి ఏ. వి. ఎస్. ఎస్. రాజు విడుదల చేశారు. ఛైర్ పర్సన్ తో పాటు కమిషన్ సబ్యులు వి. గాంధి బాబు, కే.జి, వెంకట పద్మలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ వేటుకూరి ఏ వి ఎస్ ఎస్ రాజు మాట్లాడుతూ బాలల పై జరుగుతున్న లింగ ఆధారిత హింస పై ప్రజలకు, బాలలకు అవగాహన పెంచేందుకు ముందుకు వచ్చిన హెల్ప్ సంస్థను ఆయన అభినందిస్తూ, ఇటువంటి ప్రయత్నాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదం చేస్తాయని అన్నారు. బాలల రక్షణ కోసం వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, బాధితులకు తక్షణ సహాయం అందించడం, అలాగే ఇలాంటి ఘటనలను నిర్భయంగా అధికారులుకు తెలియజేయడానికి ప్రజలను ప్రోత్సహించడం కీలకమని ఆయన వెల్లడించారు. ప్రతి చిన్నారి సురక్షితంగా, గౌరవప్రదంగా ఎదగాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, సమాజం మొత్తం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి. గాంధి బాబు, కే.జి, వెంకట పద్మలత తో పాటు హెల్ప్ సంస్థ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్, హెల్ప్ ప్రోగ్రాం మేనేజర్ వి.భాస్కర్ పాల్గొన్నారు.