ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కలవకూర్,మల్కాపూర్, అంగడిపేటలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాలలో భాగంగా “జాతి నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ పాత్ర” అనే అంశంపై ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువజన సంఘాల నాయకుడు డాక్టర్ కూన వేణు మాట్లాడుతూ, కుల,మత,భాష,ప్రాంత భేదాలు లేకుండా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిరంతరం సామాజిక సేవలో పాల్గొనడం అభినందనీయమన్నారు.దేశ నిర్మాణం మరియు జాతి నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పాత్ర అత్యంత ముఖ్యమైందని పేర్కొన్నారు.
వాలంటీర్లు స్వచ్ఛందంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తూ,ఏడు రోజులపాటు గ్రామీణ ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన కల్పించడం,సాంఘిక మరియు ఆర్థిక దురాచారాల నిర్మూలనకు కృషి చేయడం, పర్యావరణ పరిరక్షణ, అంటువ్యాధుల నివారణ వంటి అంశాలపై చైతన్యం తీసుకువచ్చి ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారుస్తున్నారని వివరించారు.
బాలికల శీతాకాల శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని అన్నారు.
అలాగే మహిళలకు సమాజంలో ఉన్న గౌరవాన్ని కాపాడుతూ భవిష్యత్తు తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ సదయ్ కుమార్,డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.