ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
కేంద్ర మానవ వనరులు మరియు యువజన వ్యవహారాల శాఖ సహకారంతో తారా ప్రభుత్వ కళాశాల,సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో కలవకూర్, మల్కాపూర్,అంగడిపేట గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాలలో భాగంగా “నాయకత్వ లక్షణాలు – నైపుణ్యాల అభివృద్ధి” అంశంపై ఆదివారం
ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమాన్ని సోలాపూర్‌కు చెందిన జ్ఞాన ప్రబోధిని సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్ఞాన ప్రబోధిని స్వచ్ఛంద సంస్థ జాయింట్ సెక్రటరీ అమూల్ గాంగిలి మాట్లాడుతూ, యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. నైపుణ్యాల ద్వారానే సరైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని,నాయకత్వ లక్షణాలు మరియు నైపుణ్యాల అభివృద్ధితో యువత ఏలక్ష్యాన్నైనా సాధించగలదని పేర్కొన్నారు.
యువత స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని,దేశ నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో నిర్మాణాత్మక కార్యక్రమాలను ప్రాయోగికంగా నిర్వహించినట్లు తెలిపారు.
అదేవిధంగా బాలికలను ఉద్దేశించి అమూల్ గాంగిలి మాట్లాడుతూ,జాతి నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళలు లక్ష్యాన్ని నిర్ణయించుకొని కృషి చేస్తే ఏ స్థాయికైనా ఎదగగలరని అన్నారు.ఈకార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్,డాక్టర్ సదయ్ కుమార్,డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.