ఏటీఎం నగదు దొంగ సికింద్రాబాద్ వాసి, టీమ్ వర్క్ తో కేసును చేదించిన పోలీసులు అభిందించిన డీసీపి శ్రీనివాస్ రూ.34.90 లక్షలు స్వాధీనం
ముద్ర, శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం నగదు రవాణా వాహనం నుండి నగదు అపహరణ చేసిన కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12వ తేదీన గోపనపల్లి తండా ప్రాంతంలో ఏటీఎంలకు నగదు సరఫరా చేస్తున్న వాహనం నుండి రూ.56 లక్షల నగదు అపహరించిన ఘటన చోటుచేసుకుందని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు అదే రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. కేసుదర్యాప్తులో భాగంగా సంఘటనా స్థల పరిశీలన, సీసీటీవీ ఫుటేజ్ సేకరణ, సాంకేతిక ఆధారాల విశ్లేషణ, సంబంధిత సిబ్బంది విచారణ చేపట్టారన్నారు. సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ నివాసి అయిన నిందితుడు బడిగెరే అజిత్ కుమార్ అలియాస్ శివ (34) సంగెం సెక్యూరిటీ ఏజెన్సీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బొమ్మనహల్ స్వస్థలమని,ఏటీఎంలో నగదు ఫిల్ చేస్తున్న సమయంలో సహచరులు వాహనం బయట ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని అజిత్ కుమార్ వాహనాన్ని నగదుతో సహా తీసుకొని పారిపోయాడన్నారు. సిబ్బందిని మభ్యపెట్టి గద్దర్ చౌరస్తా, నల్లగండ్ల ప్రాంతాలకు వెళ్లి నగదు ఉన్న ట్రంక్ బాక్స్‌ను తీసుకుని వాహనాన్ని అక్కడే వదిలి ఆటోలో పారిపోయాడని తెలిపారు.
అదే రోజు రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోని ఒక లాడ్జ్‌లో సాధారణ ప్రయాణికుడిలా దిగాడన్నారు. యాక్స్ బ్లేడ్‌తో నగదు పెట్టెను తెరిచి డబ్బును బ్యాగ్‌లో పెట్టుకుని ఈనెల 13వ తేదీన అనంతపూర్‌కు వెళ్లాడని, అనంతరం బళ్లారి, బెంగళూరు, పుణే ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసులనుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడన్నారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు ఈరోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. అదే రోజు విచారణలో అతని వద్ద నుంచి రూ. 34,90,000 నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి, పంచనామా నిర్వహించామని తెలిపారు. మిగిలిన నగదును జల్సాల కోసం వాడుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడిని ఈరోజు రిమాండ్‌కు తరలించామన్నారు. డ్రైవర్ల నియామకంలో నిర్లక్ష్యం వహించిన సంగం సెక్యూరిటీ ఏజెన్సీపై ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ చట్టం–2005 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్రమత్తంగా వ్యవహరించి నిందితుడి అనుమానాస్పద కదలికలను గమనించి పోలీసులకు సమాచారం అందించిన ఎస్‌వీఆర్ బస్ ట్రావెల్స్ డ్రైవర్ ఉమాకాంత్‌ను పోలీసులు అభినందించారు.
ఈ కేసును డీసీపీ సెరిలింగంపల్లి జోన్ సీ హెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో, నార్సింగి సీసీఎస్ మాదాపూర్ సహకారంతో గచ్చిబౌలి పోలీసులు, డిటెక్టివ్ విభాగం, క్రైమ్ బృందం సమన్వయంతో ఛేదించారు.