ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట జిల్లా పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
జేఏసీ కన్వీనర్ జోగు బిక్షపతి మాట్లాడుతూ, పెన్షనర్లను జనవరి 2026కు ముందు రిటైర్ అయిన వారు, ఆ తరువాత రిటైర్ అయిన వారిగా రెండు వర్గాలుగా విభజించి, వారికి వర్తించాల్సిన పి.ఆర్.సి (PRC), డి.ఆర్ (DA) వంటి ప్రయోజనాల్లో వివక్ష చూపించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చి 25, 2025న పార్లమెంట్‌లో వ్యాలిడేషన్ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసిందని విమర్శించారు.
ఈ వ్యాలిడేషన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలనే డిమాండ్‌తో మార్చి 25 బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై ఈ నిరసనను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కోరారు.
ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు జిల్లా నర్సింలు, బోరెడ్డి మధుసూదన్ రెడ్డి, అన్నమరెడ్డి, పోలీసు రాజులు, వీరారెడ్డి, శ్రీరామ్, ఆంజనేయులు, విశ్వనాథం, నారాయణరెడ్డి, బన్సీలాల్, భగవాన్ రెడ్డి, నాగేందర్, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండయ్య, పరుశరాములు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.