- ట్రంప్ కు భయపడి మోడీ యుద్ధం విరమించారు.
- ప్రపంచ పటంలో పాకిస్థాన్ కనిపించొద్దనే కాంగ్రెస్.. మోడీకి మద్దతిచ్చింది.
- పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుకునేందుకు పాక్ పై యుద్ధం చేయాలని చెప్పాం.
- అయినా కేంద్రం యుద్ధ విరమణ అఖిలపక్షం నిర్ణయం తీసుకోలేదు.
- జైహింద్ యాత్ర సభలో ప్రధాని మోడీపై సీఎం రేవంత్ ఫైర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భయపడ్డ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాకిస్తాన్ తో యుద్ధాన్ని విరమించారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు వీరతిలకం దిద్ది యుద్ధం చేయమంటే ట్రంప్ చెప్పాడని ఆయన యుద్ధం నిలిపేశారన్నారు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం చేతకాదు బీజేపీ నేతలు.. కాంగ్రెస్‌పై మాత్రం విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని బాచుల్లిలో భారత సైన్యానికి మద్దతుగా ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడారు. కశ్మీర్ లోని పెహల్గాంలో భారత పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధాని మోడీని అనేక సార్లు కోరామని సీఎం చెప్పారు. దేశ భద్రత విషయంలో అంతా ఒక్కటే అని సంకేతాలు ఇచ్చామన్నారు. పాకిస్తాన్‌కు మోడీ తగిన గుణపాఠం చెబుతారనే ఉద్దేశంతోనే తాము మద్దతిచ్చామని స్పష్టం చేశారు. కానీ నాలుగు రోజుల యుద్ధం తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అర్ధాంతరంగా యుద్ధం ఆపేశారని సీఎం వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా ముందుకు వచ్చి స్వయంగా తానే యుద్ధం ఆపానని ప్రకటించుకున్నారన్నారు. యుద్ధం సమయంలో అఖిలపక్షంతో భేటీ నిర్వహించిన ప్రధానమంత్రి..ఆ అసలు యుద్ధం ఆపే ఆలోచన వచ్చినప్పుడు అఖిలపక్షంతో ఎందుకు చర్చించలేదని సీఎం ప్రశ్నించారు. గుండెళ్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధంలో గెలిపిస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటకు చెందిన ఆర్మీ జవాన్ కల్నల్ సంతోష్ ను చైనా పొట్టన పెట్టుకుంటే మోడీ.. ఆ దేశానికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఆనాడు చైనాపై యుద్ధం ప్రకటించి ఆ దేశానికి గట్టి బుద్ధి చెప్పిన ఘనత ఇందిరమ్మదని సీఎం వ్యాఖ్యానించారు. చైనాను మోకాళ్లపై కూర్చోబెట్టిన ఘనత ఇందిరాకే దక్కిందన్నారు. కానీ మోడీ ఇందుకు భిన్నంగా ప్రవర్తించారని విమర్శించారు. దేశ భద్రత అనేది ప్రధాని మోడీ సొంత నిర్ణయం కాదని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని మోడీ.. ట్రంప్‌కు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తమతో పాటు దేశం మొత్తం ముక్త కంఠంతో చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. బెలూచిస్తాన్‌ను విడగొట్టి మరో దేశంగా చేయాలని కోరామని చెప్పారు. అయినా కేంద్రం మాత్రం ఎవరి మాటను వినిపించుకోలేదన్నారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే… వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టిందని సీఎం చెప్పారు. తనపై కుట్ర చేసి 2018 ఎన్నికల్లో ఓడించారని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2018లో కొడంగల్‌లో కుట్ర చేసి ఓడించినా.. ఆ వెంటనే మల్కాజ్‌గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి తనను లోక్‌సభకు పంపించారని అన్నారు. తాను నేను సీఎంగా ఉన్నానంటే కార్యకర్తల కఠోర శ్రమే అన్నారు. కార్యకర్తలు వారి చెమటను రక్తంగా మార్చి తనను గెలిపించారని రేవంత్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు.
