మహదేవపూర్, ముద్ర :
సరస్వతి అంత్య పుష్కరణకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అధికారులను కోరారు.

తాత్కాలిక మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈఓ కార్యాలయంలో దేవాదాయ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పిఆర్ ఇంజినీరింగ్, విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య, ఆర్టీసి అధికారులతో శాశ్వత, తాత్కాలిక పనులపై సమీక్ష నిర్వహించారు. సరస్వతి ఆది పుష్కరాలలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా ఉండాలని ఎలాంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 540 మరుగు దొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బస్టాండ్ లో సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఘాట్ వద్ద క్లాడింగ్, రెయిలింగ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. లైటింగ్ లోకేషన్లు గుర్తించాలని దేవాదాయ శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. మే మొదటివారంలో పనులు ప్రారంభించాలన్నారు. హెలిప్యాడ్, బారికేడ్లు ఏర్పాటుతో పాటు నదిలో భక్తుల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు నదిలోకి వెళ్ళడానికి అనువుగా ఘాట్ల వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. 12 రోజుల పాటు హారతి కార్యక్రమాలు నిర్వహించాలని, దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయాలని తెలిపారు. పబ్లిక్ అడ్రెస్ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కాళేశ్వర మహత్యంపై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పుస్తకాలు ప్రచురణ చేయాలని తెలిపారు. పీఠాధిపతులచే యాగ క్రతువులు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని తెలిపారు. ఆహ్వాన పత్రికలు తయారు చేయాలన్నారు. కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరిలతో కలిసి సరస్వతి ఘాట్, మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న విగ్రహాలు పరిశీలించారు.పలు శాఖల వారిగా చేపట్టిన శాశ్వత, తాత్కాలిక పనులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ధార్మిక అడ్వైజర్ గోవిందహరి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, దేవాదాయ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పీఆర్, మిషన్ భగీరథ, ఆర్టీసీ, వైద్య, విద్యుత్తు, పర్యాటక తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.