ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వందతులను కూడా నమ్మవద్దని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గ్యాస్ నిలువలు, సరఫరాపై ఎల్పీజీ డీలర్లు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
యుద్దం ప్రభావం వలన జిల్లాలో ఎలాంటి ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకున్నా తరువాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా గ్యాస్ సరఫరా ఉంటుందన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, గృహ అవసరాలకు వినియోగించే ఎల్.పి.జి గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని, అదేవిధంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాధ శరణాలయాలు, వృద్దాశ్రమాలు వంటి సంస్థలకు ఎలాంటి కొరత లేదని ఆయన తెలిపారు. జిల్లా ప్రజలు గ్యాస్ పై వస్తున్న అవాస్తవాలను, వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్బన్ ప్రాంతాలకు చెందిన వారు 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒక సారి చొప్పున గ్యాస్ బుక్ చేసుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్ చేసినట్లు తమ దృష్టికి వస్తె కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని
కలెక్టర్ తెలిపారు. ఏదేని సమస్యలు అధికారుల దృష్టికి వచ్చినట్లయితే తనకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ గ్యాస్ సరఫరా సందర్భాల్లో శాంతి భద్రతను కాపాడిన బాధ్యత పోలీసు అధికారుల దన్నారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్ కాకుండా నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, ఆర్డీవో వాసుచంద్ర, డిసిఎస్ఓ సుదర్శన్, డీఎంసిఎస్ మురళి కృష్ణ, డీఎంహెచ్ఓ స్వర్ణ కుమారి, డిఇఓ రేణుకాదేవి, డిబిసిడిఓ మాధవ రెడ్డి, డీఏఓ రాజారత్నం, డిడబ్ల్యుఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.