ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన శనివారం వికారాబాద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.
వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయి బాబా కాలనీలో నివాసం ఉంటున్న బలిజ దివ్య 24 కోట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుంది. ఆమెను ధారూర్ సీఐ కార్యాలయంకు అటాచ్ చేయడంతో ఇక్కడ విధులు నిర్వహిస్తుంది. అయితే శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంభీకులకు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వికారాబాద్ సి ఐ రఘు కుమార్ సంఘటనస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడిన దివ్య సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు.