- తెలంగాణను నైపుణ్య హబ్ గా మార్చాలన్నదే మా సంకల్పం.
- ఈ డిసెంబర్ 9న “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ” శాశ్వత క్యాంపస్ ప్రారంభం.
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణను నైపుణ్య హబ్ హబ్ గా తీర్చి దిద్దేందుకు “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” మార్గ నిర్దేశంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” నిర్మాణ పనుల పురోగతిని ఆయన మంగళవారం పరిశీలించారు.అనంతరం గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ”ని ఏర్పాటు చేశామని వివరించారు.రాష్ట్ర యువతలో ప్రతిభ కొదవలేదన్నారు.కొంచెం సానబెడితే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఓవైపు పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మరోవైపు తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.తొలిదశలో భాగంగా మీర్ఖాన్ పేట్ లోని స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ లో అకడమిక్ బ్లాక్, ప్రయోగశాలలు, వసతి గృహాలు, వైస్ ఛాన్సలర్ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.వీటిని ఈ ఏడాది డిసెంబర్ 9న లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం స్కిల్స్ యూనివర్సిటీలో సంబంధిత దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఫార్మా, రిటైల్, లాజిస్టిక్స్, ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నామన్నారు. ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని, విజయవంతంగా పూర్తి చేసిన 70 శాతం నుంచి 80 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు.
ఏడాది వ్యవధిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు.ఒకేసారి 100 అడుగులు వేయలేమని తెలిసినా కొందరూ ప్రతిపక్ష నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.భావితరాల అవసరాల కోసం సుస్థిరాభివృద్దే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగో నగరంగా “ఫ్యూచర్ సిటీ”ని అభివృద్ధి చేస్తామన్నారు.త్వరలోనే ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయాన్ని స్థానికంగా ప్రారంభిస్తామన్నారు.సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ వీసీ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు, ఓఎస్డీ కం రిజిస్ట్రార్ చమాన్ మెహతా, ఇతర ఉన్నతాధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
