- వెలుగులోకి వచ్చిన మరో ప్రీలాంచ్ మోసం
- ఆందోళనలో బయ్యర్లు
- సొమ్ము అడిగితే బెదిరింపులు
- ఎల్బీనగర్ కేంద్రంగా ప్రీలాంచ్ దందా
- 2020లో సేల్స్.. ఇప్పటిదాకా ఆరంభం కాని పనులు
- కస్టమర్ల మనీని డైవర్ట్ చేశారనే ఆరోపణలు
- ఆందోళనకు దిగిన బాధితులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : సామాన్యుడి సొంతింటి కలను రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఏదో ఒక భూమిని చూపించి.. ప్రీలాంచ్ ఆఫర్లతో వసూళ్లు చేసుకుంటున్నారు. ఇలా మధ్యతరగతి వర్గాల వారి కలల్ని కూల్చేస్తూ.. కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీ-లాంచ్ పేరుతో వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ఫ్రీ-లాంచ్ మోసం వెలుగు చూసింది. క్రితికా డెవలపర్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. తట్టి అన్నారంలో ప్రీ-లాంచ్ పేరుతో భారీగా వసూళ్లు చేశారు. అతి తక్కువ ధరకు ఫ్లాట్స్ అంటూ దాదాపు 200 మంది నుంచి రూ.70 కోట్ల వరకు వసూళ్లు చేశారు. డబ్బులు వసూలు చేసినా నిర్మాణం చేపట్టలేదు. దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించారు. ఆందోళనకు దిగారు.
హైద్రాబాద్‌లో ప్రీ లాంచ్ మోసాల పరంపర ఆగట్లేదు. ఒకరిని చూసి మరొకరు ఉడాయిస్తున్నారో.. లేక టైమ్ చూసి బిచాణా ఎత్తేస్తున్నారో.. కానీ.. ప్రతీ వారం- పది రోజులకోక కంపెనీ మోసం బయటపడటం మాత్రం కలవరపెడుతోంది. సువర్ణభూమి, ఆర్జే గ్రూప్, భారతీ లేక్ వ్యూ వంటి చీటింగ్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో సంస్థ బండారం బయటపడింది. ప్రీ లాంఛ్ ఆఫర్ పేరుతో బయ్యర్లను రోడ్డున పడేసింది. ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్రితికా ఇన్‌ఫ్రా డెవలపర్స్. నాలుగేళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సంస్థ తమ ఫ్లాట్స్ ఎక్కడా..? అని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. క్రితికా ఇన్ ఫ్రా తీరుతో కస్టమర్లు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు.
నిర్మాణ రంగంలో కొంతమంది మోసగాళ్ల పుణ్యమా అని ఇప్పుడు ఆ నమ్మకమే పోయేలా కనిపిస్తోంది. ప్రీ లాంఛ్ ఆఫర్లు.. బై బ్యాక్ సేల్స్ అంటూ మోసం చేస్తుండటంతో డబ్బులు కట్టిన వారంతా రోడ్డున పడుతున్నారు. ఇలా నెలలో రెండు లేదా వారం-పది రోజులకో కంపెనీ బిచాణా ఎత్తేయడం మాత్రం ఆందోళన చెందాల్సిన విషయమే. లేటెస్ట్‌గా ప్రీ లాంఛ్ ఆఫర్ల పేరుతో మోసం చేసింది క్రితికా ఇన్‌ఫ్రా డెవలపర్స్. డబ్బులు కట్టించుకోని సంవత్సరాలు దాటినా- ఇప్పటివరకు తమ ఫ్లాట్స్‌ను తమకివ్వలేదంటూ కస్టమర్లు ఆందోళన చేస్తున్నారు.
2020లో ప్రీ లాంచ్ పేరుతో సేల్స్ చేసి కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు క్రితికా ఇన్‌ఫ్రా నిర్వాహకులు వసూలు చేశారు. ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్రితికా ఇన్‌ఫ్రాకు రాధా భూక్యా ఎండీ కాగా.. డైరెక్టర్‌గా ధూమవాత్ గోపాల్.. సీఈవోగా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. హైద్రాబాద్ శివార్లలోని తట్టి అన్నారంలో 2 ఎకరాల్లో శేషాద్రి ఓక్ పేరుతో ఎస్+6 అపార్ట్‌మెంట్ నిర్మిస్తామని 2020లో ప్రీ లాంచ్ సేల్స్ చేసి ఇప్పటివరకు నిర్మాణాలు కూడా చేపట్టలేదు. అలాగే ఉప్పల్‌లో 3 ఎకరాల్లో శేషాద్రి సిల్వర్ ఓక్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తామని హ్యాండిచ్చారు. ప్రీ లాంచ్ పేరుతో దాదాపు 200 మంది కస్టమర్స్ నుంచి కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా.. బయ్యర్ల నుంచి కలెక్ట్ చేసిన డబ్బుని తమకున్న ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రితికా ఇన్ ఫ్రా తమని మోసం చేస్తుందని గ్రహించిన బాధితులు తమ డబ్బును తిరిగివ్వమని అడగ్గా మొదట్లో మాయమాటలు చెప్పి తప్పించుకొన్న యాజమాన్యం.. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు దిగుతోందని బాధితులు వాపోతున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. తాజాగా దీనిపై పోలీసులను సైతం ఆశ్రయించారు.