ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
బిజెపి నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ పై నమోదైన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన సిపిఎం సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ బాలికపై లైంగిక దాడి చేసి బెదిరింపులకు గురిచేసి కేసు సెటిల్మెంట్ ప్రయత్నాలు చేయడం అత్యంత దారుణం అని దేశంలో “భేటీ బచావో- బేటి పడావో”అని నినాదాలు ఇస్తూ బిజెపి నాయకత్వం మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో నేరస్తులను కాపాడే సంస్కృతిని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుండి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాత్ర పై సమగ్ర విచారణ జరపాలన్నారు. పోక్సో కేసు నమోదయ్ ఐదు రోజులు గడిచిన నిందితుడిని అరెస్టు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోకుండా బండి సంజయ్ కుటుంబానికి కొమ్ముకాస్తున్నట్లుందని అన్నారు. అధికార దాహంతో తన కుమారుడు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఇది మహిళల భద్రతను తాకట్టు పెట్టడమే అవుతుందన్నారు. బండి భగీరథను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, రాళ్ళబండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు చోప్పరి రవికుమార్,జాలిగపు శిరీష తదితరులు పాల్గొన్నారు.