Take a fresh look at your lifestyle.

ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ అభిలాష అభినవ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సాధారణ స్థాయికి మించి 1.5°C నుండి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని, జిల్లాలో వచ్చే వారం రోజుల పాటు వేడి గాలులు (హీట్‌వేవ్) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ పట్టణాలు, గ్రామాలు, ట్రాఫిక్ కూడళ్ల వద్ద అవసరమైన ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్ వంటి సేవా సంస్థలను భాగస్వాములుగా చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో ప్రజలకు తాగునీటితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్‌ను అత్యవసరంగా సిద్ధం చేసి అమలు చేయాలని, ప్రదేశాల వారీగా వాతావరణ పరిస్థితులను భారత వాతావరణ శాఖ వెబ్‌సైట్ ద్వారా నిరంతరం పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, డీహైడ్రేషన్ చికిత్సకు అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.