- సీఎం రేవంత్ కీలక నిర్ణయం.
- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు.
- మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనల పురోగతిపై ఆరా.
- కేంద్ర అనుమతులు, ఢిల్లీలో అధికారుల హామీపై సమాలోచనలు.
- ఇప్పటికే కేంద్రం వద్ద మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలు.
- రూ.24269 కోట్ల అంచనాలతో కేంద్రాన్ని నివేదించిన రాష్ట్ర సర్కార్.
- కేంద్రంతో పాటు చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్ ప్రతిపాదనలు.
- కొత్తగా ఎయిర్ పోర్టు నుంచి యంగ్ ఇండియా స్కిల్ డెవెలప్మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో 2 ప్రణాళిక.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని నిర్ణయించారు.అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిపై సీఎం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు.ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవెలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని చెప్పారు.అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏతో పాటు ఎఫ్ఎస్డీఏ ను (ఫ్యూచర్ సిటీ డెవెలప్మెంట్ అథారిటీ)ని ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు.
- జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ విస్తరణ.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24269 కోట్ల అంచనాలతో డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది.కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.
