ముద్ర, గద్వాల:
ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు అత్యంత కీలకమైన సమయంలో జూరాల ప్రాజెక్టు ఆదారపడి ఉన్న కుడి కాలువ ద్వారా వస్తున్న నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జూరాల కుడి కాలువలో రాళ్లు వేసి డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సాగునీరును మళ్లించడంతో ఆయకట్టు మీద ఆదారపడి ఉన్న వ్యవసాయానికి సాగునీటి సరఫరాకు ఆటంకం కలుగుతోంది. గద్వాల మండలం ప్రవహిస్తున్న జూరాల కుడి కాలువ పైభాగంలో డిస్ట్రిబ్యూటరీ నంబర్ 12(పిల్ల కాలువ) బీరొళ్లు గ్రామం వద్ద కొందరు రైతులు స్వార్థంతో కాలువలో పెద్దపెద్ద రాళ్లు, మట్టి బస్తాలు వేసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీనివల్ల కుడి కాలువ పై ఆదారపడి ఉన్న అనంతపురం, బస్రాచెర్వు తదితర గ్రామాల రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగు నీరందడం లేదు. దిగువన ఉన్న వందలాది ఎకరాల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కుడి కాలువ మీద అదారపడిన డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సాగునీరు మళ్లించేందుకు కొందరు రైతులు రాళ్లతో అడ్డువేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడం లేదని, ఎంతో పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయని దిగువ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
”కాలువలో రాళ్లు వేసి డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీటిని మళ్లించడం వల్ల తోటి రైతుల నోటి దగ్గర కూడు తీసేసినట్లవుతుంది. నీటి పంపిణీలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. వెంటనే అధికారులు స్పందించి అడ్డంకులను తొలగించకపోతే పంటలు పూర్తిగా దెబ్బతింటాయి అని ఆయకట్టు రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, కాలువలోని అడ్డంకులను తొలగించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన పక్షంలో ఆందోళన బాట పడతామని వారు హెచ్చరిస్తున్నారు.