ముద్ర ప్రతినిధి, మెదక్:
వడ్ల కొనుగోళ్లపై సీఎం, మంత్రులకు పట్టింపే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ద్వజమెత్తారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదన్నారు. ఆదివార చేగుంట మండలం కర్నాల్పల్లి వద్ద కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను, వానలకు తడిసిన వడ్లను పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు మంట్లాడుతూ…రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. ఇక్కడ కేంద్రం ప్రారంభించి 25 రోజులైంది. ఇప్పటివరకు కేవలం రెండే లారీలు వచ్చాయి. పది రోజులకు ఒక లారీ వస్తే ఈ వడ్లన్నీ ఎప్పుడు కొనాలి? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు వడ్లు తడిసి, మళ్లీ ఆరబెట్టినా కొనలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ఇంతవరకు వడ్ల కొనుగోళ్లపై ఒక్క రోజైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారా? మీ మంత్రులతో ఒక్క మీటింగ్ అయినా చేశారా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టడం తప్ప.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కష్టాలు ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టవా? అని ఆగ్రహం వ్యక్తం చేశార్.
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోళ్లపై సమీక్ష చేశారా? అన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. ఒకసారి పోలీసులను పక్కనపెట్టి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల కన్నీళ్లు, కష్టాలు ఏంటో అర్థమవుతాయన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సర్పంచులే వడ్లు కొనాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా తయారైందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభమే కాలేదన్నారు.
35 రోజుల నుంచి సన్ ఫ్లవర్ కొనుగోళ్లు ఆగిపోయాయి. కుప్పల కింద ఆ పంటకు చెదలు పడుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి వల్లే నేడు అది దివాలా తీసింది. ఆ సంస్థ ఎన్పిఏ కావడంతో బ్యాంకులు అప్పులివ్వడం లేదు. దొడ్డిదారిన కోఆపరేటివ్ బ్యాంకు నుంచి మార్క్ ఫెడ్ కు, అక్కడి నుంచి సివిల్ సప్లైస్ కు డబ్బులు మళ్లించారు. మీ అవినీతి, తప్పులకు రైతులను బలిచేస్తున్నారు.
రేషన్ షాపుల్లో ఏళ్ల తరబడి నిల్వ ఉన్న సుమారు రూ. 500 కోట్ల విలువైన దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోయాయి.
వాటిని అమ్మి రికవరీ చేయాలన్న కనీస సోయి, బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు.
ప్రభుత్వం తక్షణమే మేల్కొని లారీలు పంపించి, కాంటాలు పెట్టి వడ్లు కొనాలి. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులంతా కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హరీష్ రావు హెచ్చరించారు.