Take a fresh look at your lifestyle.

జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన కోసం మార్చి 28న జిల్లా వ్యాప్తంగా నిర్వహణ

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ శ్రీ డి. రమాకాంత్ హాజరై మాట్లాడారు. ఈ నెల 28న నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు.
లోక్ అదాలత్‌లో భూవివాద కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు కేసులు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
“రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కారం కావడంతో పాటు అప్పీల్ లేని తీర్పు లభిస్తుందని, దీని ద్వారా సమయం మరియు ఖర్చు ఆదా అవుతాయని అన్నారు. ఇరువర్గాలు రాజీ చేసుకోవడం ద్వారా సుఖసంతోషాలతో జీవించవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా జాతీయ లోక్ అదాలత్ పోస్టర్‌ను జిల్లా జడ్జి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి శ్రీమతి నసీం సుల్తానా మాట్లాడుతూ, కక్షిదారులు పగలు, ప్రతీకారాలు పెంచుకోకుండా రాజీ మార్గాన్ని అనుసరించడం వల్ల మానవ సంబంధాలు బలపడతాయని అన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.