- హస్తినలో తెగని చర్చ.
- అత్యవసరంగా ఉత్తమ్‌కు పిలుపు.
- శాఖల మార్పుపై ఏఐసీసీ నుంచే బుజ్జగింపులు.
- సీఎం దగ్గర నుంచి కట్ కానున్న పలు శాఖలు.
- శ్రీధర్ బాబుకు మున్సిపల్ ..?
- ఇంకా అలకవీడని ఆశావాహులు.
- బుజ్జగింపుల కోసం సీనియర్లకు ఆదేశాలు.
- ఢిల్లీలోనే సీఎం, మంత్రులు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మంత్రివర్గ విస్తరణే కాదు.. మంత్రులకు శాఖల కేటాయింపుపైనా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయించాలనే అంశం హస్తినలో హాట్ హాట్‌గా నడుస్తుంది. రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పటికే రాహుల్, ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. అంతకు ముందు ఏఐసీసీ జనరల్‌సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. ఈ చర్చల అనంతరం ఏఐసీసీ పెద్దలు అత్యవసరంగా మంత్రి ఉత్తమ్‌ను ఢిల్లీకి పిలిచారు. దీంతో మంత్రులకు శాఖల కేటాయింపు వ్యవహారం మరింత ఉత్కంఠకు తెరలేపుతున్నది. మరోవైపు, సామాజిక సమతుల్యంతో కేబినెట్ పోస్టులు భర్తీ చేసినట్లు చెబుతుండగా అటు ఆశావాహులు అలకబూనారు.ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావులు అలకబూనినా కాంగ్రెస్ పెద్దలు నచ్చజెప్పడంతో కూల్ అయ్యారు. సుదర్శన్‌రెడ్డి మాత్రం ఇంకా ఫైర్ మీదే ఉన్నారు. ఆయన వర్గీయులు రాజీనామాలతో రచ్చ రాజేస్తున్నారు.ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటుగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలను కలిశారు. కేబినెట్ విస్తరణ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అధిష్టానానికి వివరించారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు.
- సర్దుబాటు చేయడమా..?
మంత్రులకు శాఖల కేటాయింపు వ్యవహారం సర్దుబాటు ప్రక్రియ ద్వారా చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో ఉన్న మంత్రుల శాఖలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. అయితే, కొత్తగా వచ్చిన మంత్రులు కూడా తమకు నచ్చిన శాఖ కోసం కూడా ఫైరవీలు మొదలుపెట్టారు. కొత్త మంత్రుల్లో వివేక్ వెంకటస్వామి కీలకమైన విద్యుత్ శాఖ కావాలని కోరుతున్నట్టు సమాచారం. వాకిటి శ్రీహరికి క్రీడ, యువజన, న్యాయ శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అడ్లూరి లక్ష్మణ్‌కి ఎస్సీ వెల్ఫేర్ శాఖ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపు ఫైనల్ అయ్యాయని అంటున్నారు. కానీ, పాత మంత్రులకు సంబంధించిన శాఖల మార్పుపై ఇంకా చర్చలు కొలిక్కి రానట్లుగా అర్థమవుతున్నది. హోం శాఖ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. లా అండ్ ఆర్డర్‌కు ప్రత్యేకంగా ఓ మంత్రి ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అందుకే, హోంశాఖను భట్టి విక్రమార్కకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. ఆర్థిక శాఖను కూడా భట్టి దగ్గరే ఉంచుతారా? మరొకరికి బదలాయిస్తారా? అనేది ఆసక్తికరం. మిగతా మంత్రుల శాఖలోనూ స్వల్ప మార్పులు జరుగుతాయని ఢిల్లీ వర్గాల సమాచారం.అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే అలకలు, గొడవలకు కేరాఫ్‌గా ఉండేది. రేవంత్ వచ్చాక అలాంటి వాటికి చెక్ పడింది. కేబినెట్ విస్తరణలో అసంతృప్తులను బుజ్జగించిన విధానంపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఇలా మంత్రుల పదవీ స్వీకారం ముగిసిందో లేదో.. అలా ఇంఛార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆశావహుల ఇంటికి వెళ్లి కలిశారు. వారికి ఈసారి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో వివరంగా చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నచ్చజెప్పారు. ఆ చర్చలు ఫలించి ఎలాంటి అసంతృప్తులు లేకుండా కేబినెట్ కథ సుఖాంతం అయింది.
- సుదర్శన్‌రెడ్డి కోసం..
మరోవైపు, సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంపై బోధన్ కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 31 మంది నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్‌లో మరో ఇద్దరికి ఛాన్స్ ఉండటంతో ఇప్పుడు పోరాడితే.. అప్పటి వరకైనా వస్తుందనే ధీమాతో తగ్గేదేలే అంటున్నారు. బీటీ నగర్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. స్థానిక బస్ స్టాండ్ దగ్గర బోధన్ పట్టణ కాంగ్రెస్ నేతల నిరసన నిర్వహించారు. అటు, కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాజిటివ్‌గా స్పందించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు వేములవాడ ఎమ్మెల్యే.
- మంత్రి ఉత్తమ్‌కు పిలుపు.
విస్తరణ తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇపుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఏఐసీసీ రమ్మనడంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర క్యాబినెట్ లో కీలక మార్పులుంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పలువురి మంత్రుల శాఖలను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ ,వాకిటి శ్రీహరిలకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్,ఉత్తమ్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటుందని, ఇపుడున్న మంత్రుల పనితీరు ఎలా ఉంది..శాఖలు మార్చుదామా వద్దా.? అనేది సీఎం, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ చీఫ్ ఖర్గే మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తున్నది. అలాగే కేబినెట్ లో ఖాళీగా ఉన్న మరో మూడు మంత్రి పదవులు భర్తీపై కూడా చర్చించనున్నారు.
- ఇక్కడా అదే.
మంత్రి పదవులే కాదు.. శాఖల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయంకు ప్రాధాన్యత నివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదంటూ ఇప్పటికే కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి నివేదించారు. అలాగే మంత్రుల పనితీరుపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వివిధ స్థాయి నేతలతో భేటీలో అందిన సమాచారం ఆధారంగా ఆమె నివేదికలు రూపొందించారు. కీలక శాఖల బాధ్యతలు అన్ని కొందరు మంత్రులే నిర్వహిస్తుండటంతో పని భారం కారణంగా కొన్ని శాఖల్లో ఆశించిన ఫలితాలు రావట్లేదనే అంచనలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు. మంత్రుల పనితీరు వ్యవహార శైలిపై కేసి వేణుగోపాల్ గతంలోనే ఢిల్లీలో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, మంత్రుల వ్యవహార శైలి, పనితీరుపై తన అంచనాలను అధిష్టాన ముఖ్యులతో సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు. విద్య, మున్సిపల్ పట్టణాభివృద్ధి,హోం, న్యాయ సహా పదికి పైగా కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను విడగొట్టి మున్సిపల్ శాఖను మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది. కాగా తనకు విద్యుత్తు లేదా విద్యాశాఖ ఇవ్వాలని వివేక్ కోరుతున్నారు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వద్ద విద్యుత్ శాఖ ఉంది. త్వరలో కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా, సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఇందిరా భవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి దాదాపు గంటసేపు చర్చించారు. ఆ తర్వాత మంగళవారం రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరెవరి దగ్గర ఏయే శాఖలున్నాయి? రెండు, మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారెవరు? కొత్తగా మంత్రివర్గంలో చేరిన వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కు ఏ శాఖలు కేటాయించాలి? అనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన జాబితాను కేసీ వేణుగోపాల్‌కు సీఎం రేవంత్ అందించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
సీఎం నుంచి కొన్ని కట్.
ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలను కొత్తవారికి కేటాయించే అంశంపై సమాలోచన జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. అందులో ప్రధానమైనవి.. విద్య, పురపాలకం, హోం, గనులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వాణిజ్య పన్నులు, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, క్రీడలు యువజన శాఖ. వీటిలో విద్యా శాఖ లేదా విద్యుత్ శాఖను తనకు కేటాయించాలని గడ్డం వివేక్ కోరుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మల్లికార్జున ఖర్గేకు సైతం తెలియజేసినట్టు సమాచారం. అయితే, వివేక్‌కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ.. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరి మంత్రుల శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పటికే కీలక శాఖలు చూస్తూ.. కేబినెట్‌లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న శ్రీధర్ బాబుకు మున్సిపల్ శాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. దీనిపై బుధవారం సాయంత్రం వరకు క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.