ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బైంసా, ఖానాపూర్ పురపాలక సంఘాల్లో కిస్సా కుర్సీకా మొదలైంది. మ్యాజిక్ ఫిగర్ చేరేందుకు కావలసిన ఇద్దరు ఇండిపెండెంట్ లో ఎవరో ఒకరికి చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తామని ప్రకటించారు. తమ సతీమణి ఖుతేజా సిద్ధికా ను తొలి సగం పదవీ కాలానికి చైర్మన్ చేస్తేనే మద్దతు ఇస్తామని ఆమె భర్త ఇద్రీస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. భైంసా లో ఎంఐఎం 12 స్థానాలు సాధించగా, బీజేపీ 6, ఇండిపెండెంట్లు 5 మంది కలిసి వారికి బలం 11కు చేరుతుంది. ఇలా చూసినా పదవికి అవసరమైన 14 స్థానాలు ఇద్దరికీ లేవు. ఈ నేపథ్యంలో 24,25 వార్డుల కౌన్సిలర్లు ఫర్హానా బేగం, ఖుతేజా సిద్దిఖా లలో ఎవరో ఒకరికి తొలి సగం పదవీ కాలానికి చైర్మన్ చేయాలని మెలిక పెట్టారు. ఒక వర్గం వారు రెండో సగం ఇస్తామన్నా తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. కాగా బీజేపీ, ఎంఐఎం లు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నించినా వారు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా ఎంపీ గోడం నగేష్ ఓటు తొలుత ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో నమోదు కాగా, హడావిడిగా దాన్ని భైంసా కు మార్చారని తెలుస్తోంది.
ఖానాపూర్ లో…

రోజు రోజుకు క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఖానాపూర్ మున్సిపల్ లో మొత్తం 12 వార్డుల్లో 4 బీజేపీ, మరో 4 వార్డులు బి ఆర్ ఎస్ కైవసం చేసుకున్నాయి. మిగతా 3 వార్డులలో కాంగ్రెస్, ఇండిపెండెంట్ 1 వార్డులో గెలుపొందారు. దీంతో ఖానాపూర్ బల్దియా పై కాంగ్రెస్ పార్టీ జండా ఎగరేసేందుకు ఎంఎల్ఏ వెడ్మా బొజ్జు యత్నాలు చేస్తున్నారు. బి ఆర్ ఎస్, బీజేపీ ల నుండి అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు రాయబారాలు కొనసాగాయి. ఐతే తమ పార్టీ వారికే చైర్మన్ పదవి కట్టబెట్టాలని రెండు పార్టీలు పట్టుబట్టడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ చేరాలని బొజ్జు శతవిధాలా యత్నిస్తున్నారు.