Take a fresh look at your lifestyle.

తెలంగాణ ముఖచిత్రంపై గులాబీ సంతకం

  • ఉద్యమం నుంచి స్వరాష్ట్రం వరకు.
  • స్వరాష్ట్రం నుంచి అధికారం వరకు
  • అడుగడుగునా అవాంతరాలు.. ఎదురొడ్డి విజయాలు.
  • తడబడి.. నిలబడి.. ఎగిరిన గులాబీ జెండా.
  • నేడు 25వ వసంతంలోకి ఉద్యమ పార్టీ.
  • బీఆర్​ఎస్​ రజతోత్సవం స్టోరీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : గులాబీ జెండా…..ఇది  ఎక్కడ రెపరెపలాడినా తెలంగాణే గుర్తుకొస్తుంది. ఆ జెండాను తెలంగాణ అస్తిత్వ పతాకంగా నిలిపిన కేసీఆర్‌ అనే మూడక్షరాలు మెరుస్తాయి.ఆ మెరుపే తెలంగాణను తేజోమయం చేసిన  పార్టీగా  భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించింది. తెలంగాణే జెండాగా, ఎజెండాగా నిలిచి గెలిచింది.దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి, తెలంగాణను సాధించి, తెచ్చిన రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపింది. తెలంగాణ తలరాతను మార్చి సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించింది.జల దృశ్యం నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన పార్టీ నేటితో 25వ పడిలోకి అడుగుపెడుతున్నది.అందుకే ఈ వేడుకలను నభూతో..నభవిష్యత్ అన్న రీతిలో, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచే విధంగా అంగరంగ వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహిస్తోంది.2001, ఏప్రిల్‌ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడు పోసుకున్న పార్టీ,నేడు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి ప్రవేశించింది.ఇందులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ 14 ఏండ్లు అవిరామంగా పోరాటం చేసి..అనేక ఉద్యమాలు చేసింది.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల్లో బీఆర్‌ఎస్‌ సుస్థిరస్థానం సంపాదించింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇంటి పార్టీగా స్థిరపడిపోయింది. తెలంగాణ సంతోషమే.. బీఆర్‌ఎస్‌ సంతోషం. తెలంగాణ బాధే బీఆర్‌ఎస్‌ బాధ అన్నంతగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బీఆర్‌ఎస్‌ తన పదేండ్ల పరిపాలనలో అటు అభివృద్ధిలో ఇటు ప్రజా సంక్షేమంలో అతిచిన్న వయస్సులోనే అతిపెద్ద విజయాలు సాధించి దేశాన్నే అబ్బురపరిచింది. వాస్తవానికి చాలా మంది చరిత్ర నుంచి ప్రభావితమవుతారు.కాన కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  ఒకరుగా మిగిలారు.తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయతీరాలకు చేర్చారు.ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు విధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది.1969 ఉద్యమం అణగారిపోయిన తర్వాత..తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా? అని జనం ఆశగా ఎదురు చూసిన సమయంలో గులాబీ జెండాను చేత పూని కేసీఆర్ బయల్దేరారు. చినుకుగా మొదలైన ఆ ఉద్యమ ప్రస్థానం అనతి కాలంలోనే తుఫాన్ గా మారి..రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. 2001లో జలదృశ్యంలో స్థాపించిన టీఆర్ఎస్ (తదనంతరం బీఆర్‌ఎస్‌గా మారింది). అప్పట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే 2004లో పార్లమెంటులో ‘తెలంగాణ మాట’ను మొదటిసారి విపక్షంగా లేవనెత్తిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఆయన మాటల్లో ‘జిల్లాల మధ్య అసమానతలు, నదులపై హక్కు లేకపోవడం, నీటికి నిరాకరణ,ఉద్యోగాల విభజనలో అన్యాయం, భాషా ధ్వంసం  ఇవన్నీ నా ప్రజలకు జరిగిన ద్రోహం. దీన్ని తట్టుకోలేకనే ఉద్యమాన్ని చేపట్టాను’ అని చెప్పారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్​ సచ్చుడో’ అనే తెగింపు ఉద్యమం చేపట్టిన కేసీఆర్​ చివరకు విజయ తీరాన్ని ముద్దాడే దాకా వదలలేదు. సుమారు పధ్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేశారు.  లక్షలాది మంది విద్యార్థుల త్యాగం, ఉద్యోగుల ఉపవాసం, రైతుల నిరీక్షణ, మహిళల ఆశల ఫలితంగా  2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించ గలిగారు.ఆయన రాజకీయ పోరాటంలో అనేకసార్లు ఉప ఎన్నికలు తెచ్చి తెలంగాణ ఏర్పాటుకు ప్రజాభిప్రాయాన్ని  ఢిల్లీకి చాటిచెప్పాడు.‘వేయిదశల వ్యూహం’ కేసీఆర్ ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది.సకల జనుల సభలతో తెలంగాణ గొంతును విశ్వవ్యాప్తం చేయగలిగారు. దేశంలోని అనేక రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టి కేంద్రంపై రాజకీయ ఒత్తిడిని తేగలిగారు. గతంలో సోనియాగాంధీ చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని బహిరంగ సభలో ఇప్పించింది  కేసీఆరే. ఉద్యమ లక్ష్యం చివరకు 2014లో ఫలించింది.  అసాధ్యమైన తెలంగాణను సాధించి సుసాధ్యం చేసిన ఘనత  కేసీఆర్ దే అంటూ  ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ  ఆయనను ప్రశంసించడం గమనార్హం.
  • విశ్వాసమే ఆయువుపట్టుగా..
తెలంగాణ కోసం  ఎవరూ లేకుండా..దిక్కులేకుండా పడి ఉన్నసమయంలో నేనున్నా అంటూ కేసీఆర్ ముందుకొచ్చారు. నాటి రాజకీయ పార్టీలు నిట్టనిలువునా తెలంగాణకు అన్యాయం, దగా చేస్తున్నప్పుడు..మోసం చేస్తున్నప్పుడు..ఒక్కడై కేసీఆర్‌ బయలుదేరారు. తెలంగాణ అయితదా? పోతదా? అనే సంశయంలో ఊగిసలాడుతున్నప్పుడు పిడికెడు మందిని తన వెంట పెట్టకొని బయలుదేరారు.బక్కపలచని మనిషి..సినీ గ్లామర్‌లేదు.. ఆర్థికంగా పరిపుష్టి ఉన్న నాయకు డు కాదు.. అన్నింటికీ మించి ఇద్దరు బలమైన నాయకులు (చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి)..ఇలాంటి ప్రతికూలతల మధ్య ‘జై తెలంగాణ’ నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. తెలంగాణ పట్ల బలమైన విశ్వాసాన్ని కల్పించాలంటే ‘కేసీఆర్‌ పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు’ అని నిరూపించాలి? అనుకున్నారు.అందుకు తగ్గట్టుగానే డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఇలా ఏకకాలంలో మూడు పదవులను గడ్డిపోచలా కేసీఆర్ విసిరికొట్టారు. తెలంగాణ చర్చకు తిరిగి ప్రాణ ప్రతిష్ట చేశారు.తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తాను ఎత్తుకున్న ‘జై తెలంగాణ నినాదం నుంచి పదవుల కోసమో..మరో దానికోసమో పక్కకుపోతే రాళ్లతో కొట్టి చంపుండ్రి’ అని పిలుపు నిచ్చారు. ఇవన్నీ తెలంగాణ సమాజంలో నమ్మకాన్ని కలిగించాయి. కేసీఆర్‌ వెంట నడిచేందుకు దోహదపడ్డాయి. 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన రోజున..తెలంగాణ ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం 2014లో రాష్ట్రాన్ని సాధించేదాకా కేసీఆర్‌ అలుపెరుగని పోరు చేశారు.2001 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం ఎన్ని వ్యూహాలు? ఎన్ని పోరాట మార్గాలు? గతానుభవాలు నేర్పిన పాఠాలతో ఈసారి తెలంగాణ వెనక్కి వెళ్లిపోతే ఇక తెలంగాణ నినాదమే ఆఖరికి అసెంబ్లీలోనే కాదు..సమాజంలోనూ తెలంగాణ పదం శాశ్వత నిషేధమేనని గ్రహించారు.కనుకనే పుట్టినగడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని అవమానాలను దిగమింగారు.ప్రజల్లో సడలిపోయిన తెలంగాణ విశ్వాసాన్ని ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులో నిలిపారు. ఒక్క పార్టీకూడా మద్దతు ఇవ్వని తెలంగాణకు దేశంలోని 36 పార్టీలు మద్దతిచ్చేస్థాయికి తీసుకొచ్చారు.తెలంగాణకు అడ్డం పడ్డవాళ్లతోనే ‘జై తెలంగాణ’ అనిపించారు. ఎదుటివారి రాజకీయ అనివార్యతను తనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని తెలంగాణకు బలంగా మారాడు.తెలంగాణ కోసం ‘గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటా..కుష్టురోగినైనా కౌగిలించుకుంటా’ అని 2004లో ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యమని పేర్కొన్న కేసీఆర్ తెలంగాణ సమాజం తనవెంట నడిచేందుకు బాటలు వేసుకున్నారు. పొత్తు ధర్మాన్ని వీడిన కాంగ్రెస్‌ 2006లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకొని తెలంగాణ నినాదం సచ్చిపోయిందని నిరూపించే ప్రయత్నం చేసినా..నిటారుగా నిలబడి సడలిపోని ధైర్యంతో పోరాటం చేశారు. తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించిన టీడీపీతో 2009 ఎన్నికల్లో పొత్తుపెట్టుకొని ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా అనివార్యతను కేసీఆర్‌ సృష్టించగలిగారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే తెలంగాణ సాధ్యమని, అందుకు అన్ని పార్టీల మద్దతు అవసరమని మెలికపెడితే దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒప్పించి వాటితో తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇప్పించిన చరిత్రను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది.
  • గమ్యాన్ని ముద్దాడిన దీశాలి.
ఒకవైపు లాబీయింగ్‌..మరోవైపు పోరాటం ఈ రెండు మార్గాలను సమాంతరంగా నడుపుతూ 2014లో తెలంగాణ గమ్యాన్ని ముద్దాడిన ధీశాలిగా కేసీఆర్‌ చరిత్ర సృష్టించారు. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్‌ ప్రసంగాలను, కేసీఆర్‌ వ్యూహాలను, కేసీఆర్‌ ఎత్తుగడలను గమనించినవారి అంచనాలకు అందనంత ఎత్తున తెలంగాణను నిలిపారు. తన పదునైన వ్యూహాలతో ఎప్పటికప్పుడు తెలంగాణ వాదా న్ని, నినాదాన్ని నిత్యం సజీవంగా ఉంచేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎత్తుకోని అంశం.. కేసీఆర్‌ పట్టుకోని విషయమూ లేదంటే అతిశయోక్తికాదు. 2014 నుంచి పదేండ్ల పాటు అంతకుముందు 14 ఏండ్లపాటు ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌ను చూసినవారు..విన్నవారు ఆయన ఆచరణ, అసమాన్య పాలనాదక్షతను చూసి నివ్వెరపోయారు. తన పదేండ్ల పాలనా కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో అకాశమంత ఎత్తున నిలిపారు. తెలంగాణ వస్తే కరెంట్‌లేక ‘చీకటి’ రాజ్యమేలుతుందని, నక్సలిజం పెట్రేగిపోతుందని, పద్నాలుగేండ్ల ఉద్యమ తెలంగాణ నిత్యం ఆందోళనలతో కూరుకుపోతుందని, సాగునీరు లేక, తాగునీరులేక, పాలించే నైపుణ్యం లేక తెలంగాణ ఎందుకూ పనికిరాకుండాపోతుందని శాపనార్థానాలు పెట్టినవారు కేసీఆర్‌ సారధ్యంలోని బీఆర్‌ఎస్‌ పాలనను చూసి కాపీ కొట్టాల్సిన అనివార్యతలను తెలంగాణ సృష్టించింది.ఇంతటి ఘన చరిత్రను మరోసారి మననం చేసుకొని మది మది పులకించిపోయేలా పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంరంభాన్ని అంబరాన్నంటేలా నిర్వహించాలని పార్టీ భావిస్తున్నది.
  • జోలెపట్టి.. భిక్షమెత్తిన నేత.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు గత రాజకీయ పార్టీల ఏలుబడిలో ఛిద్రమైపోయిన తెలంగాణ జీవనచిత్రాన్ని చూసి కేసీఆర్‌ కంటనీరు పెట్టుకున్నారు. చేనేత కార్మికుల ఆకలిచావులు చూసి చలించిపోయారు. రైతన్నల ఆత్మహత్యలు నిత్యకృత్యంలా సాగుతున్న కాలానికి ఎదురునిలిచి ధైర్యం నింపారు. తలాపునే గోదావరి, కృష్ణమ్మ పారుతున్నా చుక్కనీరు లేక గొంతులెండుతున్న తెలంగాణ కష్టాన్ని చూసి కన్నీటి పర్యాంతమయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల్లో నాటి నేతన్నల ఆత్మహత్యల పరంపర, ఆత్మహత్యలు చేసుకోవద్దని కలెక్టర్లు గోడల మీద విజ్ఞప్తులు చేస్తున్న కాలాన్ని చూసి ఆయన తీవ్రంగా ‌ చలించిపోయారు. అలాగే సిరిసిల్ల, పోచంపల్లి ప్రాంతాల్లో నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే తట్టుకోలేక జోలెపట్టి విరాళాలు సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసిండు. ములుగులో బిడ్డ పెండ్లికోసం అప్పుతెచ్చిన సొమ్ము, బంగారం ఆగ్నిప్రమాదానికి గురై కాలిబూడిద కావడంతో కన్నీరుమున్నీరైన తండాకు అన్నీతానై కేసీఆర్‌ అండగా నిలిచారు. కల్పన అనే గిరిజన యువతి పెండ్లికి ఆర్థిక సాయం చేసిండు (ఆ కల్పన దీన నేపథ్య గాథ నుంచే కల్యాణలక్ష్మి పథకం పుట్టింది).
  • కుట్రల బోనులోంచి బెబ్బులిలా..
2001లో ఆవిర్భవించినప్పటి నుంచి 2014లోరాష్ట్రాన్ని సాధించి…అధికారంలోకి వచ్చేంత వరకు  బీఆర్‌ఎస్‌ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పార్టీ పెట్టినప్పుడు అసలు ఈ పార్టీ ఉండదని, ‘మఖలో పుట్టి పుబ్బలో పోతది’ అన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కేసీఆర్‌ పదవుల కోసమే పార్టీ పెట్టిండని, తెలంగాణపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ఆయనపై ముప్పేటదాడి జరిగింది. చంద్రబాబు ఎత్తులతో శిథిలావస్థలో చిక్కిశల్యమైన కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌తో 2004లో పొత్తుపెట్టుకోవటం వల్ల ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నకాలంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్‌ఎస్‌ను నిట్టనిలువునా చీల్చారు. తెలంగాణ వాదం లేదని నమ్మబలికే ప్రయత్నం చేస్తే 2006లో కేసీఆర్‌ కేంద్ర మంత్రి పదవికి మాత్రమే కాకుండా కరీంనగర్‌ ఎంపీ పదవికీ రాజీనామా చేసి తెలంగాణవైపు దేశం తిరిగి చూసేలా చేసినప్పటి నుంచి.. ‘కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ శవయాత్రో తెలంగాణ జైత్రయాత్రో’ అని నినదించి నవంబర్‌ 29, 2009 ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రకటనతో కేంద్రం దిగివచ్చేలా
చేశారు.ఎంచుకున్న లక్ష్యసాధన కోసం ప్రతి సందర్భాన్ని తెలంగాణ సందర్భంగా మలిచిన చరిత్ర కేసీఆర్‌ది. ఆందోళనలు, ఆమరణ నిరాహారదీక్షలు, బహిరంగసభలు మాత్రమే కాదు ఉప ఎన్నికలను సైతం ఉద్యమవ్యూహంగా మలిచిన చరిత్ర కేసీఆర్‌ది.  ఆయన‌ నాయకత్వానికి తిరుగులేదని అనేక సందర్భాలు నిరూపించాయి.
  • పాలనలో కేసీఆర్‌కు సాటెవ్వరు?
ఉద్యమంలోనే కాదు..పాలనలోనూ తెలంగాణను శిఖరాయమానం చేసిన దార్శనికత కేసీఆర్‌ది అని కేంద్రప్రభుత్వం అనేక సందర్భాల్లో కీర్తించింది.ఒకనాడు ఈసడించుకున్న తెలంగాణను ఇంద్రధనుస్సులా మార్చిన దిక్సూచి కేసీఆర్‌ అని రాజకీయంగా తను అంటే గిట్టనివారు సైతం అంగీకరించే సత్యం.‘మిషన్‌కాకతీయతో చెరువు సిగలో మొగ్గ అయిండు, మిషన్‌భగీరథతో గొంతులో మంచినీరయ్యారు.తెలంగాణకు చిన్ననీటి వనరులను పెద్ద ఆదెరువుగా నిలిపి అందరికీ ఆదర్శప్రాయమయ్యారు అని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ వంటివారు ప్రశంసించిన సందర్భాలు అనేకం.గోదావరిని కాళేశ్వరంతో ఎత్తిపోసి దేశానికి కేసీఆర్‌ జలసందేశాన్ని ఇచ్చారని, అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నివేశమే సజీవ ఉదహరణ అని  ఉదహరించారు. తెలంగాణ చీకటి అయితదని శాపనార్థాలు పెట్టినోళ్ల కండ్ల ముందు వెలుగు జిలుగుల విద్యుత్తు తేజమై ప్రక్రియల్లేవా చేశారు. తెలంగాణ చీకటి అయితదని చెప్పిన నాయకుడే రాజకీయ భవిష్యత్తులేకుండా మారిపోయాడని  పేర్కొంటున్నారు. ‘ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను, పొతం పట్టిపోయిన పోచంపల్లిని సిరుల ముల్లెలుగా మార్చిండు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడొకరు కేసీఆర్‌ పట్టుదలను కొనియాడారు.‘ఇక‌ రైతు ఇంట కేసీఆర్ కనుల పంట అయ్యారు.రైతుబంధు, రైతుబీమా పథకాలతో  వ్యవసాయానికి మళ్లీ పురుడు పోశారు.పుట్టిన బిడ్డకు కేసీఆర్‌ కిట్‌ అయ్యారు..గర్భందాల్చిన ఆడబిడ్డకు మేనమామలా న్యూట్రిషన్‌ కిట్‌ అయ్యారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్స్‌..ఇలా సంక్షేమంలో కేసీఆర్‌ హయాంలో తెలంగాణ స్వర్ణయుగం’ అని  ప్రతిపక్ష నేతలు సైతం నర్మగర్భంగా మెచ్చుకున్న దాఖలాలు కోకొల్లలు.2014 నుంచి 2023 వరకు టీఆర్​ఎస్​ పాలన తెలంగాణను అన్ని రంగాల్లో పునరుజ్జీవింపజేశారు.ఎడారిలా మారిన తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్​ సస్యశ్యామలం చేయగలిగారు.  పాలకుడిలో సాహసం ఉండాలి. అలాంటి నేత దేన్నైనా సాధించగలడని పదేండ్లలో కేసీఆర్​ నిరూపించుకున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేసిన చరిత్ర ఆయనది. ప్రతి గ్రామానికి యోగ్యమైన మంచినీటి పథకాన్ని (మిషన్​ భగీరథ)  అమలు చేసి దేశాన్నే ఆశ్చర్యపరిచారు.అందుకు అన్ని రాష్ట్రాలకూ తెలంగాణ ఆదర్శంగా మారింది.కాళేశ్వరం, పాలమూరు, వాగులు, వంకలు ఎక్కడున్నా అక్కడ చెక్​ డ్యామ్​లతో తెలంగాణను దేశంలోనే అద్భుతమైన వాటర్​ హబ్ ​గా మార్చారు. దీంతో దేశంలో తాగు, సాగు నీటికి కొరతలేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ వచ్చిన నాడు కరెంటు కోతలు. 6 నెలల్లోనే కోతలులేని రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ సొంతం చేసుకున్నారు. సుమారు 1.50 కోట్ల టన్నుల ధాన్యాగారంగా మార్చిన చరిత్ర పదేండ్ల కేసీఆర్​ పాలనలో చూశాం.రైతు బంధు, రైతుబీమా ఇచ్చిన కేసీఆర్​ పాలనను చూసి దేశమే నివ్వెరపోయింది.రైతు కష్టాలను తొలగించిన రైతు బాంధవుడని ప్రతి రైతూ ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నాడు.  రేవంత్​ పాలనను తిట్టిపోసుకుంటుండటమే అందుకు సాక్ష్యం. సంక్షేమం అభివృద్ధిని జోడెడ్లుగా నడిపిన పదేండ్ల పాలన తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది.
  • గులాబీ  ప్రస్థానం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన బీఆర్ఎస్ ( నాటి టీఆర్‌ఎస్‌) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి.టీఆర్ఎస్ గా పురుడుపోసుకుని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినపార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెడుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పురుడుపోసుకుని భారత రాష్ర్టసమితిగా రూపాంతరం చెందిన బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది. ఒక రాష్ట్ర చరిత్రలో 25 ఏండ్లు అంటే తక్కువేం కాదు. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీగా, ఉద్యమ పంథాలో కొనసాగి, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పదేండ్లు అధికారంలో కూడా ఉండటం బీఆర్‌ఎస్‌ ప్రత్యేకత.2001, ఏప్రిల్‌ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా పురుడుపోసుకున్న పార్టీ.. ఏప్రిల్‌ 27, 2025 నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి ప్రవేశించనున్నది. ఈ నేపథ్యంలో పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ 14 ఏండ్లు అవిరామంగా పోరాటం చేసి, అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన పార్టీగా బీఆర్‌ఎస్‌ కు రాష్ర్టంలో గుర్తింపు ఉంది.  తెలంగాణ రాష్ట్ర సమితి.. భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయంపాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. అంతకుముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగరవేశారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది టీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక.. కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్‌తోపాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది.2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన..ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్.ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి..ఘనవిజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్..కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవతెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన గులాబీ నాయకత్వం.. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించింది.పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ రెండోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ మధ్యలో దృష్టి సారించారు.కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో అది సాధ్యం కాలేదు. అటు రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్​కు అంత అనుకూలంగా రాలేదు.స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇండ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది.అయితే  2024 ఎన్నికల్లో ఘోరా పరాజయం పాలైన బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత డీలా పడింది.ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్‌ ఫాంహౌజ్ కే పరిమితమయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలలో పదిమంది పార్టీ మారటం.అధికారం కోల్పొయి పూర్తి నైరాశ్యంలో ఉన్న పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఈ సిల్వర్‌ జూబ్లీ వేడుకలను వినియోగించుకోవాలని నాయకత్వం భావిస్తోంది.అందులో భాగంగా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ రజతోత్సవ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది.కాగా ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ.. ఫక్తూ ఉద్యమ పార్టీగా అవతరించినప్పటికీ మారిన పరిణామాల క్రమంలో రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే  దేశంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీగా 2022 లో  రూపుదిద్దుకుంది. అయితే 2024 లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో..ఆ పార్టీ  ప్రస్తుతం రాష్ట్రానికే పరిమితమైంది.
  •  విజయ పరంపర
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యంలో  పురుడు పోసుకున్న టీఆర్ఎస్..దినదిన ప్రవర్ధనమానమై నేడు దేశ రాజకీయాల్లో  ప్రధాన రాజకీయ పార్టీకి మారింది అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసీఆర్..అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సరికొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పార్టీ స్థాపనే ఒక సంచలనం కాగా..2001 మే 17న కరీంనగర్ లో నిర్వహించిన సింహ గర్జన సభ దేశాన్ని ఆకర్షించింది. లక్షలాది ప్రజలు ‘జై తెలంగాణ’ అని నినదించడంతో మలి ఉద్యమానికి అడుగు పడింది. అదే ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 జిల్లా పరిషత్ స్థానాలు, 85 జెడ్పీటీసీ, 3 వేల సర్పంచ్, 12 వేల వార్డు, వందకు పైగా ఎంపీటీసీ స్థానాలను సొంతం చేసుకుని టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.2003లో వరంగల్ లో ‘తెలంగాణ జైత్రయాత్ర’ కాంగ్రెస్ తో పొత్తుకు దారి తీసింది.2010 డిసెంబర్ 16న వరంగల్ లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి టీఆర్ఎస్ చాటి చెప్పింది.కాగా  కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలు సొంతం చేసుకుంది.యూపీఏలో చేరడంతో కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు.అయితే రెండేళ్ల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ మాట మార్చడంతో 2006లో యూపీఏ నుంచి టీఆర్ఎస్ బయటకు వచ్చింది.రాజీనామా చేయడంతో 2006 సెప్టెంబర్ 13న జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు.తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రం చేయడంలో భాగంగా ఏప్రిల్ 2008లో పార్టీ 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు తృణపాయంగా పదవులకు రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 7 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు సొంతం చేసుకుంది. 2009 ఎన్నికల్లో తెలంగాణ సాధన కోసం మహా కూటమిగా ఏర్పడిన కూటమిలో టీడీపీ, బీజేపీతో కలిసి టీఆర్ఎస్ చేతులు కలిపింది. 45 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగా 10 ఎమ్మెల్యే, 2 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది.2014లో స్వరాష్ట్ర కల తెలంగాణను తీసుకురావడంతో టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 63 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టింది.ఇక 17 ఎంపీ స్థానాల్లో 11ను సొంతం చేసుకుని టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది.వ్యూహంలో భాగంగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.117 స్థానాల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని కొత్త చరిత్ర లిఖించింది.2019 లోక్ సభ ఎన్నికలు కొంత నిరాశ కలిగించాయి.17 స్థానాల్లో 9 ఎంపీ స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకుంది.ఇక 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూడగా..2024 లో పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడింది.
  • కేసీఆర్ ను ఎంచుకున్నది ఉద్యమమే ..
తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలనే ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణగా కేసీఆర్ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు.వలస వాదం సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వ స్పృహను కాపాడుకుంటూ.. విజయ పతాకం ఎగురవేశారు.1969 ఉద్యమం అణగారిపోయిన తరువాత..ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు వస్తాడా? అన్న ముక్కోటి ఆశల ప్రతిరూపంగా..కేసీఆర్‌ గులాబీ జెండా ఎగురవేశారు.తెలంగాణను విముక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో త్యాగధనులున్నారు.కానీ ఉద్యమమే కేసీఆర్‌ను ఎంచుకుంది.రెండు దశాబ్దాలుగా తెలంగాణను ఊగించి, ఉరికించి, దీవించి, శాసించి.. విజయతీరాలకు చేర్చిన నాయకుడు కేసిఆర్‌! అవును..కేసిఆర్ ఉన్నత వ్యక్తిత్వం ముందు, ఆయన ఉక్కు సంకల్పం ముందు విధి సైతం తలవంచింది.ఆయన వ్యూహ చతురత వల్ల.. సిద్దాంతాలకు, పార్టీలకు అతీతంగా నాయకగణం తెలంగాణకు జై కొట్టింది. కేసీఆర్‌ అచంచల దీక్ష, సిద్దాంత బలం, వాగ్ధాటికి ముగ్ధులై..జాతీయ స్థాయిలో అనేక పార్టీలు తెలంగాణకు మద్దతు పలికాయి. ఫలితంగా తెలంగాణా ఆవిర్భవించింది. వెనుకబడిన తెలంగాణ వేదనలోంచి గులాబీ జెండా ఎగసింది. కేసీఆర్‌ నేతృత్వంలో ముందుకు ఉరికింది. సుశిక్షితులైన కార్యకర్తలే పునాదిగా పురోగమించింది.ధనబలం ఉన్న పార్టీలను జనబలంతో ఢీకొట్టింది. ఉద్యమ పార్టీగా భూకంపం పుట్టించింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసింది. స్వరాష్ట్రంలో సకల జనుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ పీఠం అందుకుంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి..తనదైన శైలిలో సుపరిపాలన అందించింది. ప్రస్తుతం విపక్ష పార్టీగానూ అవిశ్రాంతంగా ప్రజా గళం వినిపిస్తోంది.
  • ఒక్కతాటి మీదికి తీసుకొచ్చిన మహోద్యమం.
కేసీఆర్‌ స్థాపించింది ఒక రాజకీయపార్టీని మాత్రమే కాదు. అది మూడున్నర కోట్ల మంది ప్రజలను ఒక్కతాటి మీదికి తీసుకొచ్చిన మహోద్యమం! ఒక మనిషి తన జీవితకాలంలో కోట్లాది ప్రజలను ప్రభావితం చేసిన మహాద్భుత సన్నివేశం! డిప్యూటి స్పీకర్ పదవి మొదలుకొని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కేంద్ర మంత్రి వంటి పదవులను ప్రజల ఆకాంక్ష కోసం తృణప్రాయంగా వదిలిన ఘన చరిత్ర బీఆర్‌ఎస్‌ సొంతం! ఆ త్యాగమే పార్టీని ప్రజలకు దగ్గర చేసింది. రాజీనామా చేసి వచ్చిన ప్రతిసారీ రెట్టింపు మెజారిటీతో ప్రజానీకం గెలిపించింది. భావజాల ప్రచారం దగ్గర్నుంచి.. ఉద్యమ కార్యాచరణ వరకు..రాజకీయ సమరం నుంచి..ప్రజా సమస్యలపై పోరాటాల వరకు.. 25 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ నడిపిన తీరు అద్భుతం..అనితర సాధ్యం!టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైన రోజున దేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం! పద్నాలుగు ఏండ్ల పోరాటం తర్వాత.. దాదాపు అన్ని పార్టీలు అనుకూలం! వ్యవస్థలైనా, రాజకీయ పార్టీలైనా.. తెలంగాణకు అనుకూలంగా మారవలసిన అనివార్యతను సృష్టించడం కేసీఆర్‌ వ్యూహ చతురతకు నిదర్శనం. ఉద్యమం తొలినాళ్ల నుంచి మొదలుపెట్టి.. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకూ ప్రతి దశలో అత్యంత నేర్పుతో, వ్యూహ చతురతతో తెలంగాణను విజయ తీరాలకు చేర్చారు కేసీఆర్‌. గుప్పెడు మందితో ప్రారంభమైన పార్టీ..ఇప్పుడు ఉప్పెనగా మారిన తీరు. అనితర సాధ్యంగా మారింది. ఈ ప్రయత్నంలో ఆయనకు ఆచార్య జయశంకర్ తోడుగా నిలిచారు. తెలంగాణ ఏర్పాటును వాయిదా వేస్తూ పోయిన కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకవైపు.. ఉద్యమాన్ని దెబ్బతీయాలనే కుయుక్తులు ఇంకోవైపు.. ఈ రెంటినీ మట్టి కరిపించి.. గులాబీ పార్టీ కాలపరీక్షకు నిలిచి గెలిచింది.కేసీఆర్‌ ఏం చెప్పారో అదే చేశారు. రక్తపాతం లేకుండా..రాజకీయంగానే తెలంగాణ తెస్తామన్నారు. తెచ్చారు. తిట్టిన నోళ్లె పొగిడే స్థాయిలో, ఆకాశమంత ఎత్తుకు పార్టీని పెంచారు. ఇందుకోసం ఆయన కఠోర క్రమశిక్షణ పాటించారు. అందరికీ అది అలవాటు చేశారు. అధ్యయన శీలత అంటే ఏమిటో.. రాజకీయ నాయకుడికి అది ఎంత అవసరమో ఆయన నిరూపించారు. అంతేకాదు, బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలతో మమేకం చేయడంలో కేసిఆర్ కొత్త ఒరవడిని నెలకొల్పారు. ఆయన మేధావులలో మేధావి, కవుల మధ్య కవి, కళాకారులతో ఉంటే కళాకారుడు. పత్రికా సంపాదకులకు పాత్రికేయులకు ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు అందరికీ పార్టీతో ఉద్యమ సంబంధం కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది. బిందువుగా ప్రారంభమైన పార్టీ నేడు సింధువుగా మారింది. రజతోత్సవ సంబురాలు జరుపుకొంటోంది.
  • తెలంగాణ జెండాగా గులాబీ.
గులాబీ జెండా ఒక పార్టీ జెండాగా కాకుండా తెలంగాణా జెండాగా మారిందంటే దానికి కారణం కేసీఆర్‌ మర్గదర్శకత్వమే! రెండున్నర దశాబ్దాల ఘన చరిత్రను సగర్వంగా స్మరించుకుంటూ, ఈ 25 ఏళ్ల పండుగ వేళ ప్రతి కార్యకర్త గుండె నిండా గులాబీ పూస్తోంది. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ బీఆర్‌ఎస్‌..బంగారు తెలంగాణ బాట నిండా గులాబీలు పరుస్తోంది. రజతోత్సవ వేదికగా.. కేసీఆర్‌ సారథ్యంలో మరో విజయ ప్రస్థానానికి సిద్ధమవుతోంది!ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ చరిత్రలో 25 సంవత్సరాల పాటు కొనసాగడం అంటే అంత సులువైన విషయం కాదు.అందులోను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ…ఆనే లక్ష్యాన్ని చేరుకొని, కొత్తగా ఏర్పడిన  తెలంగాణ రాష్ట్ర అధికార పగ్గాలను చేపట్టడం మాములు విషయం కాదు. అదొక అసాధరణ విజయం.  టీడీపీ స్థాపించి సంవత్సరం తిరగకుండా అధికారంలోకి వచ్చిన ఎన్టీఅర్’ది ఓ చారిత్రక విజయం అయితే  కొంత ఎక్కువ సమయం తీసుకున్నా ఏకంగా రాష్ట్రాన్ని సాధించి, కొత్త రాష్ట్రంలో వరుసగా రెండవసారి అధికార పగ్గాలను చేపట్టిన  కేసీఆర్ సాధించిన విజయం నిస్సందేహంగా అంతకు మించిన చారిత్రక విజయం. 2001 ఏప్రిల్  27 న కొండా లక్ష్మణ బాపూజీ ఆశీస్సులతో జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెరాసకు ఇప్పటి టీఆర్ఎస్ ఒకటేనా అంటే, కాదు.స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి అనంతరం సుదీర్ఘ కాలంపాటు దేశాన్ని పాలించిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యత్యాసం ఉందో, అంతే వ్యత్యాసం ఉంది.దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ కాంగ్రెస్’ను రద్దు చేయమని సూచించారు.ఇతర నాయకులు గాంధీ ప్రతిపాదనని పక్కన పెట్టారు. తెలంగాణ బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ అలాంటి ప్రతిపాదన చేయలేదు గానీ, కేసీఆర్ పార్టీని రద్దు చేయక పోయినా పార్టీ స్వరూప,స్వభావాలను మాత్రం మార్చి వేశారు.ఎన్నికలల పార్టీగా  మార్చి వేశారు.
  • భగ్నమైన తెలంగాణను కాపాడటం కోసమే.
బీఆర్​ఎస్​ రజతోత్సవ సభ రాజకీయం కోసం కాదు. ఏడాదిన్నర కాలంలో భగ్నమైన తెలంగాణను తిరిగి నిలబెట్టడానికే. ఇది భవిష్యత్ తెలంగాణ కోసం బీఆర్ఎస్ ఇచ్చే నూతన పిలుపు.ఇది తిరిగి ఉద్యమ తెలంగాణ ను మేలుకొలిపే వేదిక.ఒక ముఖ్యమంత్రి పాలన ఎలా ఉండాలో గుర్తు చేసే ఘట్టం. ఆనాటి ఉద్యమ గౌరవాన్ని గుర్తు చేసుకొని. వంచించిన రేవంత్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం, ప్రజలు తమ హక్కుల కోసం పోరాడటానికి  కేసీఆర్​ నాయకత్వంలో భగ్నమైన తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా రజతోత్సవ సభ జరగబోతున్నది.వరంగల్​ సభ, తెలంగాణ ప్రజలకు పునర్జన్మ చూపించే ఆత్మీయమైన పిలుపునిస్తున్నది. ఇది మరో ఉద్యమానికి మౌలికం. ఇది ప్రజలు ‘మన భవిష్యత్తు – మన చేతుల్లోనే’ అనే విషయాన్ని గుర్తు చేసుకునే మహాసభ. ఉద్యమానికి తిరిగి ఊపొచ్చే పునాదిగా ఈ సభ చరిత్రలో నిలిచిపోనుందని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.