- ఆకలితో ఏఆర్ మెహిఫిల్ కు వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం.
- బిర్యానీలో బల్లిని చూసి వాంతులు.. 100కు ఫోన్.
- ఫ్రై అయింది కదా తినండి అంటూ యాజమాని నిర్లక్ష్యం.
- తరచూ చోటు చేసుకుంటున్న సంఘటనలు.. పట్టని ఫుడ్ సేఫ్టీ అధికారులు.
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: ఆకలితో బిర్యాని తినేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురయింది. తాను ఎంతో ఇష్టంతో ఆర్డర్ చేసిన బిర్యాని తింటుండగా బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. ఒక్కసారిగా అందులో బల్లిని చూసి వాంతి చేసుకున్నాడు.ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని ఏఆర్ మెహిఫిల్ రెస్టారెంట్లో గురువారం చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి వివరాలు..మున్సిపల్ కేంద్రంలోని సాగర్ రహదారిపై ఉన్న మెహిఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణ రెడ్డి బిర్యాని తినేందుకు వెళ్ళాడు. రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి, తింటుండగా అందులో చనిపోయిన బల్లి కనిపించడంతో షాక్ కి గురయ్యారు. ఇదేమిటని రెస్టారెంట్ యజమానిని నిలదీయడంతో మంచిగా ఫ్రై అయింది, తిను అంటూ అహంకారంగా ప్రవర్తించారని, దీంతో ఆగ్రహానికి గురైన బాధితుడు 100కు డయల్ చేయగా పోలీసులు మేనేజర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.బిర్యానీ తిన్న బాధితుడు కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో పరీక్షలు చేయించుకున్నాడు.ఇలాంటి ఘటనలు ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే ఎన్నో వెలుగుచూశాయి.ఇటీవల రాఘవేంద్ర హోటల్ ఆనియన్ దోశలో బొద్దింక దర్శనమిచ్చింది.అయినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫైన్ ల పేరిట సరిపెడుతున్నారని, దీంతో రెస్టారెంట్లు, హోటళ్లలో యాజమాన్యాల నిర్లక్ష్యం పెరిగిపోయిందని వాపోతున్నారు.
