Take a fresh look at your lifestyle.

హస్తంలో ‘హస్తీనా’ చర్చ

  • చర్చనీయాంశంగా టీపీసీసీ నేతల ఢిల్లీ టూర్​
  • తెలంగాణ నేతలకు ఝలక్ ఇచ్చిన రాహుల్
  • సీఎం, టీపీసీసీ చీఫ్, మంత్రులకు సమయమివ్వని యువనేత
  • అదే రోజు పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ
  • కేసీ భేటితోనే సరిపెట్టుకున్న తెలంగాణ నేతలు
  • ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవం, యువనేతను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలు
  • టీపీసీసీ నేతల వ్యవహార తీరుపై అధిష్టానం అసంతృప్తి..?
  • పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ మార్పు, ఎమ్మెల్యేలపై సీఎం సర్వేపై గుర్రు
  • రాష్ట్ర తాజా పరిణామాలపై వివరణ కోరిన హైకమాండ్​
  • కలిసి ఉన్నామంటూనే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు..?
  • సీరియస్​ గా తీసుకున్న అధిష్టానం
  • నేరుగా అగ్రనేతలతో టచ్​ లో పలువురు కీలక నేతలు
  • సీఎం, టీపీసీసీ చీఫ్​ మధ్య లోపించిన సమన్వయంపై అగ్రనేతల అసంతృప్తి

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ నేతల ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఢిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం..రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు.. మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్, కార్పోరేషన్ల పోస్టుల భర్తీ.. టీపీసీసీ కూర్పుపై చర్చించేందుకు ఈ నెల 15న ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలను కలిసేందుకు యువనేత రాహుల్ గాంధీ విముఖత చూపడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో నూతన ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు,సీఎంలు, మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలందరినీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పలకరించారు.

కార్యక్రమం తర్వాత టీపీసీసీ నేతలు..రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్ మెంట్ లభించలేదు.కానీ రాహుల్ గాంధీ ఏపీ టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఝలక్ తో ఖంగుతిన్న సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులతో యువనేతను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ వారిని కలిసేందుకు ఇష్టపడని రాహుల్ గాంధీ.. కేసీని కలిస్తే చాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయినా యువనేత అపాయింట్ మెంట్ కోసం బుధవారం సాయంత్రం వరకు వేచి చూసిన టీపీసీసీ నేతలు చివరకు ఏం చేయాలో తోచక రాత్రి 8గంటల ప్రాంతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ను కలిసి రాష్ట్ర రాజకీయాలపై నివేదిక ఇచ్చారు.

అదే సమయంలో రాహుల్ గాంధీ తమకు సమయం ఇవ్వకపోవడానికి గల కారణాలనూ తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే బిజీగా ఉన్నందునే యువనేత కలవలేకపోయారనీ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో మరింతగా కష్టపడాల్సిన అవసరం ఉందని కేసీ సూచించినట్లు తెలిసింది. అదే సమయంలో పార్టీలో వ్యక్తిగత ఆరోపణలతో పాటు పథకాల అమలుపై ఏఐసీసీ స్ధాయిలో పరిశీలన జరుగుతుందనీ దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కలిసి పని చేయాలని మందలించినట్లు సమాచారం.

దీనిపై వివరణ ఇచ్చేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నించగా కేసీ..తెలంగాణలో ఏం జరుగుతుందో తమ వద్ద రిపోర్టు ఉందని చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. చివరకు కేసీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. సీఎం రేవంత్ రెడ్డి లేకుండానే మీడియాతో మాట్లాడడంపై పార్టీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలనే మీడియాకు వివరించిన టీపీసీసీ చీఫ్..ఏడాదికి పైగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ అంశం తమకు సంబంధించింది కాదని తేల్చి చెప్పేశారు. ఆ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ క్లారిటీ ఇవ్వాలని వివరణ ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది.

రాష్ట్ర పరిణామాలపై ఏఐసీసీ అసంతృప్తి

గత కొంతకాలంగా రాష్ట్రంలో అధికార పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై ఏఐసీసీ అగ్రనేతలు అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చూడడానికి కీలక నేతలందరూ తామంతా కలిసి ఉన్నట్టు నటిస్తున్నా అంతర్గతంగా విభేదాలు అలాగే కొనసాగిస్తున్నారనే విషయాన్ని అధిష్టానం గుర్తించింది. ఈ క్రమంలో కొంత మంది మంత్రులు నేరుగా హైకమాండ్​ తో టచ్​ లోకి వెళ్లడంతో వారిపై అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసుకునేందుకు ఇంఛార్జీ దీపాదాస్​ మున్షి, టీపీసీసీ చీఫ్​, సీఎం రేవంత్​ రెడ్డి లు ఉన్నా నేరుగా ఎవరికి వారే అధిష్టానంతో సంప్రదింపులు జరపడాన్ని అగ్రనేతలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏడాది కాలంగా ఊరిస్తోన్న మంత్రి వర్గ విస్తరణ కోసం రాష్ట్ర కీలక నేతలను కాదని పలువురు మంత్రులు ఢిల్లీ వేదికగా చేస్తున్న ప్రయత్నాలను పార్టీ అధిష్టానం సీరియస్​ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమకు సన్నిహితంగా ఉంటోన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు ఏఐసీసీ నేతలతో తమకున్న పరిచయాలతో లాబీయింగ్​ చేయడం వివాదస్పదంగా మారింది. ఉత్తర తెలంగాణలో ఒకరు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే మంత్రి పదవుల కోసం చేస్తున్న లాబీయింగ్​ పై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ప్రస్తుత మంత్రివర్గంలో ఓ సామాజిక వర్గానికి చెందిన మంత్రులే ఎక్కువగా ఉండగా..కేబినెట్​ విస్తరణలోనూ అదే సామాజిక వర్గం నుంచి మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని రాష్ట్ర కీలక నేతలూ కోరుతున్నారు. దీంతో అధిష్టానం ఆ సామాజికవర్గ నేతలకు మంత్రి పదవి ఇస్తే.. ఇప్పటికే మరిన్ని మంత్రి పదవులు కోరుతోన్న మరో బలమైన సామాజికవర్గం నుంచీ డిమాండ్​ పెరిగే అవకాశం ఉండడంతో అధిష్టానం మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు.. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి థర్డ్​ పార్టీతో చేపట్టిన నిర్వహించిన సర్వేపై ఇప్పటికే అవినీతి, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటోన్న నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

ఈ విషయంలో పలువురు సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సొంత పార్టీ నేతలపై సీఎం నిర్వహించిన సర్వేపైనా పార్టీ హైకమాండ్​ అసతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్​ మున్షిని ఆ బాద్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఇటీవల జరిగిన ప్రచారంపైనా ఏఐసీసీ ఆరా తీసింది. దీని వెనక అధికార పార్టీ నేతలే ఉన్నట్లు ఏఐసీసీ గుర్తించింది. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదుగుతోన్న క్రమంలో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా టీపీసీసీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై అగ్రనేతలు అసహనంతో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తానికి ఈ మొత్తం పరిణామాలతో ఢిల్లీలో అసలేం జరుగుతుంది..? టీపీసీసీ నేతలపై యువనేత అలకకు కారణాలేంటీ అనే చర్చ హాటెక్కిస్తున్నది. 

Leave A Reply

Your email address will not be published.