రామనామ జపంతో మారు మ్రోగుతున్న కొండగట్టు అంజన్న క్షేత్రం…
ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల మూడవ రోజు కాషాయమయంగా మారింది. రామనామ జపంతో కొండగట్టు అంజన్న క్షేత్రం మారు మ్రోగుతుంది. హనుమాన్ జయంతి రోజు కావడంతో రాత్రి నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరగగా, ఆలయ పరిసరాలు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగిపోయాయి. హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో మాలధారులు కొండగట్టుకు తరలివచ్చి మాల విరమణ చేసుకుని స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు.

కొండగట్టులో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్…
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, మాల విరమణ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
