- కొట్టుడు కాదు..సరిగ్గా నిలబడు ముందు
- కేసీఆర్ కు ప్రజలతో సంబంధాలు కోల్పోయాయి
- ఫాంహౌస్‌లో ఉండి సోది కాదు
- అసెంబ్లీకి వచ్చి మాట్లాడు
- సోషల్ మీడియా లైక్‌లు చూసి సంబురపడుతున్నారా..?
- మేం అన్ని పథకాలు అమలు చేస్తున్నాం
- అచ్చోసిన అంబోతుల్లా కొడుకును, అల్లుడుని ఊరిమీదకు వదిలాడు
- మీలా ఇచ్చిన హామీలు మేం ఎగ్గొట్టం
- పాలమూరును ఎండబెట్టిన దుర్మార్గులు మీరు
- రైతులకు రుణమాఫీ చేసింది మేమే
- మొగిలిగిద్ద బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : నన్ను బలంగా కొట్టే సంగతి పక్కన బెట్టి.. ముందుగా సరిగ్గా, నిబ్బరంగా నిలబడడం నేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ కు తన నాయకత్వంపై నమ్మకం ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు.ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చులు..అవినీతి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడో ఉండీ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోన్న ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఫామ్‌హౌస్‌లో ఉండి సోయి లేకుండా..సోది మాట్లాడవద్దని సూచించారు. ఇప్పటికైనా తీరుమార్చుకుని ప్రజలు నమ్మే వాస్తవాలను చెప్పాలన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. తనను గంభీరంగా చూస్తున్నానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం విరుచుకుపడ్డారు. నన్ను అలా చూడాలంటే ముందు గుండెను నిబ్బరపర్చుకోవాలన్నారు. కొడుకు, అల్లుడిని అచ్చోసిన ఆబోతుల్లా ఊరిమీదకు వదిలారని కేటీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేసిన కేసీఆర్.. పాలమూరు జిల్లాను ఎరవేసి ఎండబెట్టిన దుర్మార్గుడన్నారు. రైతులకు ఎన్ని రుణమాఫీలు చేశారో రాష్ట్ర ప్రజానికానికి వివరంగా చెప్పాలన్నారు. 2023లో తాము అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రం రూ.7 లక్షల కోట్లు అప్పుల్లో ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.18వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసిందన్నారు. అయితే ఈ రుణమాఫీ మొత్తం వడ్డీలకే సరిపోయిందని చెప్పారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను తమప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశామన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే అన్నారు. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు అన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశామో లెక్కలు చెబుతామన్నారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వేస్తున్నామన్నారు. జనవరి 26న రైతుభరోసాను ప్రారంభించామని.. మార్చి నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతుభరోసా వేస్తామన్నారు.భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామన్నారు.మొదటి ఏడాదిలోనే 55,142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దళితుల కోసం మూడెకరాలు, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి హామీలను ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్ దే అన్నారు. అది ప్రజల్ని మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.
పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్ సోషల్ మీడియాలో తనకు లైకులు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నారని సీఎం ఆరోపించారు. దీన్ని బట్టి ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలన్నారు. బీసీ కులగణన,మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నామని..దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి కాలం చెల్లిన రూ. వెయ్యి నోటు లాంటిదన్నారు. ప్రజా సంక్షేమం అహర్నిశలు పాటు డుతున్న తమ ప్రభుత్వాన్ని అభినందించడానికి మనసు రాకపోతే ఫామ్ హౌస్ లో పడుకోవాలని హితవు పలికారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్శిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని,బీఆర్ఎస్ హయాంలో యూనివర్శిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనివర్శిటీల ప్రక్షాళన చేపట్టి, వీసీలను నియమించామని ఆయన గుర్తు చేశారు.