ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం..
మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఉంటాం..
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
జీవన్ రెడ్డి పార్టీ మారడం వ్యక్తిగత విషయం..
కాంగ్రెస్ పార్టీకి లక్షలాదిమంది కార్యకర్తలు ఉన్నారు..
2029లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ముద్ర, కోరుట్ల / మెట్‌పల్లి / ధర్మపురి:
రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నామని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి మరియు ధర్మపురి వ్యవసాయ మార్కెట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా సహా పలు ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాల కోసం క్వింటాల్‌కు రూ.2400 చొప్పున మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కొనుగోళ్ల వల్ల రాష్ట్రంపై సుమారు రూ.500 కోట్ల భారం పడుతుందని ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడమే తప్ప కొనుగోలు విషయంలో రాష్ట్రానికి సహకరించడం లేదని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని వెంటనే తరలించేందుకు కేంద్ర మంత్రులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ధర్మపురి నియోజకవర్గంలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు గత ఏడాదితో పోలిస్తే 25% పెరిగిందని మంత్రి తెలిపారు. ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి, ఎండపల్లి మండలాల్లో సుమారు 4898 ఎకరాల్లో సాగు జరిగిందన్నారు. దాదాపు 1.46 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని చెప్పారు.
దళారులు క్వింటాల్‌కు రూ.1600 మాత్రమే చెల్లిస్తున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. పార్టీ మారవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆయనను కోరినా, అది ఆయన స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయమన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయని మంత్రి అన్నారు. 2014లో ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీలను 100 శాతం అమలు చేస్తామని, అమలులో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల అండతో 2029లో కూడా రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా అవుతారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ధర్మపురిలో జరిగిన కార్యక్రమాల్లో వ్యవసాయ ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.