ఏడుగురు అరెస్టు, రూ.రెండు కోట్ల విలువచేసే సమాగ్రి స్వాధీనం-శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్
ముద్ర, శేరిలింగంపల్లి:
ముద్ర, శేరిలింగంపల్లి: ‘ప్రతి విజయంలోనూ ప్రజల భాగస్వామ్యం, సహకారం ఉండాలి. లక్ష్యం సాధించాలంటే ప్రజల తోడ్పాటు తప్పని సరి. వారి సహకారం ప్రభుత్వ చర్యలకు తోడైతే పూర్తి ఫలితాలు సాధించకపోయినా కట్టడి చేసే అవకాశం ఉంటుంది’ అని శేరిలింగంపల్లి పోలీస్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ అన్నారు. కూకట్ పల్లి, పటాన్ చెరువు పోలీస్ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్న సందర్భంగా సోమవారం శేరిలింగంపల్లి డీసీపీ కార్యాలయంలో శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘ముద్ర’ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రజల సహకారం తప్పనిసరి అని, ఒక్క మాదక ద్రవ్యాలే కాదు ప్రతి అక్రమ వ్యవహారం లేదా ఏ ఇతర మంచి కార్యక్రమంలోనైనా ఫలితాలు సాధించాలంటే ప్రజల తోడ్పాటు తప్పని సరి అని గుర్తుచేశారు. గతంతో పోలీస్తే గంజాయి రవాణా, వాడకాన్ని కొంత మేరకు అరికట్టగలిగామని అన్నారు. కూకట్ పల్లి జోన్, పటాన్ చెరువు పోలీసుల స్పెషల్ ఆపరేషన్ టీం సభ్యుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు అంతరాష్ట్ర డ్రగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి వద్ద నుండి 400 కిలోల గంజాయి, డీసీఎం, కారు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని డీసీపీ తెలిపారు. అక్రమ రవాణా వ్యవహారంలో సోలాపూర్ కు చెందిన ఏ వన్ నిందితుడు మనీషా పడ్వాల్, ఒడిస్సాకు చెందిన ఏ టు నిందితుడు ట్రిబినీ పరారీలో ఉండగా అదే సోలాపూర్ కు చెందిన 24 ఏళ్ల ప్రతాప్ హరిదాస్ పవార్, ఆనంద్, బాలాజీ గణేశ్, రోహిత్ పోవల్, చందన్, చందాసివ్ సహీల్, రంజిత్ రాజేందర్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ… సోలాపూర్ నుండి ఈ నెల ఎనిమిదవ తేదీన గంజాయి కలిగిన డీసీఎంతో బయలుదేరిన ముఠాను హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలోని ముత్తంగి వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు 11వ తేదీన ఎస్వోటీ పోలీసులు దాడి చేసి వాహనాలు, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందుతులను అదుపులోకి తీసుకున్నామని, ఏవన్, ఏటు నిందితులు ఫరారీలో ఉన్నారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
సినిమా ఫక్కీలో రవాణా: సోలాపూర్ కు చెందిన డ్రగ్ ముఠా సినిమా తరహాలో ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నారని డీసీపీ తెలిపారు. ‘భారీ మొత్తంలో గంజాయి కలిగిన డీసీఎం వాహనం బయలు దేరగా ముందు ముఠా సభ్యులు ఒకరిద్దరు రోడ్డుపై పోలీసులను గమనిస్తూ ప్రయాణిస్తారు. రోడ్డుపై ఎక్కడైనా పోలీసులు ఉంటే ఆ సమాచారాన్ని వెనకనుండి మెటీరియల్ తో వచ్చే వాహనంలోని ముఠా సభ్యులకు సమాచారం అందించి జాగ్రత్త పడతారు. కూరగాయలు సరఫరా చేసే ప్లాస్టిక్ కవర్లలో గంజాయి తరలిస్తూ పోలీసులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల సరిహద్దులను ఎంచుకోవడం వీరి వ్యాపారంలో చిట్కా’ అని డీసీపీ వివరించారు. డీసీపీ ఎస్వోటీ సైబరాబాద్ పి.శోభన్ కుమార్, అదనపు డీసీపీ ఎ.విశ్వప్రసాద్ పర్యవేక్షణలో పటాన్ చెరువు ఎస్.హెచ్.వో జి.వినాయక్ రెడ్డి, డీఐ బి.రాజు, ఎస్.ఐ శివకుమార్ బృందం కృషిని సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి అభినందించారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా విషయంలో ప్రజలు పోలీసులకు సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, ప్రజలు సహకరించాలని కోరారు. విలేఖరుల సమావేశంలో గచ్చిబౌలి ఎసీపీ శ్రీధర్, ఇన్స్ పెక్టర్ బాల్ రాజ్ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.