ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ప్రజావాణికి ప్రతి వారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.
సోమవారం ప్రజావాణి సందర్భంగా ఐడిఓసీ సమావేశపు మందిరంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవో తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి మొత్తం 56 ఆర్జీలు వచ్చాయన్నారు.
ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను సకాలంలో పరిష్కరించకుండా పెండింగ్ లో ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి సంబంధించి 435 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. దరఖాస్తుదారులు అవసరమైన సందర్భాల్లో తమ ఆర్జీలకు సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలు తీసుకురాకుండా వస్తే ఆ సమస్యకు పరిష్కారం లభించదని పేర్కొన్నారు. ఆయా మండలాల్లోనూ వివిధ శాఖలకు సంబంధించి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని, ముఖ్యంగా రెవిన్యూ శాఖలో భూ సంబంధ సమస్యలపై వచ్చిన వందలాది ఆర్జీలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రతి బుధవారం ఆయా శాఖల జిల్లా అధికారులు తమ కింది స్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి పెండింగ్ లో ఉన్న ఆర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయి అధికారులు సైతం తమ పరిధిలో ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి వచ్చిన ఆర్జీలను పరిష్కరిస్తే చిన్న చిన్న సమస్యలకే ప్రజలు కలెక్టరేట్ వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా శాఖల అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, వారంలోగా షెడ్యూల్ ప్రకారం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా కార్యాలయాల గదుల్లో అనవసరమైన ఫర్నిచర్, ఫైల్స్ కనిపిస్తే సంబంధిత అధికారులపై వేటు తప్పదన్నారు. ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించాలని, ప్రతి కార్యాలయం వద్ద బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పలు రంగాల్లో వెనుకబడిందని, జిల్లా పరిపాలన యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తేనే మన జిల్లా ఆయా రంగాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలు, ఆసుపత్రులను తమ పరిధిలోని మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు తరచు సందర్శిస్తూ అక్కడి పనితీరు మెరుగుపడేందుకు సహకరించాలన్నారు. ఈ అధికారులు ప్రతి శుక్రవారం విద్యార్థులతోపాటు గురుకుల విద్యాలయాల్లో భోజనం చేయాలని, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని ఆదేశించారు. ప్రతి బుధవారం 11:00 గంటలకు పంచాయతీ కార్యదర్శులు వారి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.