ముద్ర. పరకాల.
ఐకమత్యం మహాబలం అన్న సూక్తి ఎట్లా పుట్టిందో ఏమో తెలియదు గానీ దాన్ని పట్టించుకున్న వారు ఎప్పుడు చెడిపోరు అన్నది అక్షరాల సత్యం అంటారు పెద్దలు. ఎందుకో కొందరు దాన్ని పెడచెవిన పెట్టి ముందుకు సాగి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఫలితం ఏముంటుందని కాంగ్రెస్ పార్టీలో అనుభవిజ్ఞులైన నాయకులు కార్యకర్తలు అంటున్నారు. కొద్దిరోజుల్లో జరగనున్న పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు చేరాలంటే పార్టీలోని అందరు నాయకులను కలుపుకొని ముందుకు సాగాలని కోరుతున్నారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని పార్టీ అభిమానులు గుసగుసలాడుతున్నారు. గతంలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఇనుగాల వెంకటరామిరెడ్డికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ పరిచయాలు ఉన్నాయి. ఆయన ఒక పర్యాయం పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని పొందారు. ఆయన ప్రస్తుతం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే. అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షుడిగా కొనసాగిన పరకాల మండలానికి చెందిన దొమ్మాటి సాంబయ్య కు పరకాల పట్టణంలోని దళిత , బీసీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. మొన్నటి పంచాయతీ ఎన్నికలలోనూ కొద్దిరోజుల్లో జరిగే పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో వీళ్ళ ప్రమేయం లేకపోవడంపై కార్యకర్తలో నాయకులో తీవ్రమైన అయోమయం నెలకొంది. గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పరకాల నియోజకవర్గ ఇన్చార్జిగా ఆత్మకూరు మండలానికి చెందిన ఇనుగాల వెంకటరామిరెడ్డి కొనసాగారు. దాంతో ఆయనకు పరకాల నియోజకవర్గం పైన నియోజకవర్గ కేంద్రమైన పరకాల పైన పూర్తిస్థాయిలో అవగాహనతో పాటు కార్యకర్తలపైనా, నాయకుల్లోనూ పట్టు ఉందని పార్టీలోని కొందరు నాయకులు అనుకుంటున్నారు. వీళ్ళ సేవలను పార్టీ నాయకత్వం స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో తీసుకుంటే మెరుగైన ఫలితాలు రావచ్చునని పార్టీ నాయకుల అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్లో కనబడిని ఐక్యత.
కాంగ్రెస్లో ఐక్యత ఎండమావిగా మారిందని పార్టీ నాయకులు అంటున్నారు. కొద్దిరోజుల్లో జరగనున్న పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో 22 మంది అభ్యర్థుల్లో విజయం సాధించాలంటే పార్టీ నాయకులు ఐక్యంగా కలిసి పని చేయాలని కోరుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవరించినట్లయితే కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలలో బొక్క బోర్లా పడటం ఖాయమని కొందరు నాయకులు బాహాటంగా అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్ని స్థాయిలలో గల కాంగ్రెస్ పార్టీలోని నాయకులను కార్యకర్తలను సమన్వయపరిచి ముందుకు నడిపించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలు జరగలేదని, వెంటనే ఆ ప్రయత్నాలను వేగిరియం చేసి పార్టీ అభ్యర్థులకు గెలుపుకు కృషి చేయాలని కాంగ్రెస్ లోని మెజారిటీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు.