Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ అరాచకాలను చీల్చి చెండాడుతాం

  • రాష్ట్రంలో మళ్లీ అధికారం బీఆర్ఎస్ దే.
  • వరంగల్ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి ఇచ్చిన సందేశం ఇదే.
  • పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై చీల్చి చెండాడుతామని బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.అమలుకు సాథ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ అని హెచ్చరించారు.రేవంత్ పాలనపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు  ప్రత్యక నిదర్శనం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన అశేష జనసమూహమేనని అన్నారు.సభను విజయవంతం కాకుండా ప్రభుత్వం ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజలు స్వచ్చందంగా తండోప తండాలుగా తరలి వచ్చారన్నారు.అనేక వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుని సమయానికి సభకు రాలేక పోయాయన్నారు.సభ ముగిస్తున్న సమయంలోనూ ప్రజలు తరలి వస్తున్నారంటేనే వారు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు అనడానికి  ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్క తుర్తిలో ఆదివారం పార్టీ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు సోమవారం విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  ఈ సభను విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  సభకు లక్షల సంఖ్యలో ప్రజలు సభకు హాజరై కేసీఆర్  నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారని కొనియాడారు.ఈ సభ ద్వారా గులాబీ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ తెలిపారు.బీఆర్ఎస్ ప్రజా బలాన్ని ఈ సభ మరోసారి నిరూపించిందని గర్వంగా పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలమైనప్పటికీ, లక్షలాది మంది ప్రజలు ముందే సభ ప్రాంగణానికి చేరుకోవడం తెలంగాణ ప్రజల నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.ఈ సమావేశం రజతోత్సవ సమావేశాల కార్యక్రమాలకు కేవలం ప్రారంభ మాత్రమేనని ఆయన తెలిపారు.కేసీఆర్  స్వయంగా “నేనే ముందుండి పోరాడతాను” అని ప్రకటించడంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతామని కేటీఆర్ అన్నారు.ప్రజలను చైతన్య పరిచేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను, దోపిడీ చర్యలను మీడియా ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అరాచకాలను,వారి ప్రచారాలను ఎక్కడికక్కడ ఎదుర్కొని ప్రజల్లో స్పష్టత తీసుకురావాలని, మరింత చురుకుగా ముందుకు సాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
  • పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్
రాష్ట్ర పార్టీ నాయకులతో పాటు పార్టీ శ్రేణితో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున స్పందించి సభ విజయవంతం కావడంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన వరంగల్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యేలు,పార్టీ కార్యకర్తలకు కూడా కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సభా ప్రాంగణం వద్ద గత నెల రోజులుగా నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి ఫలితంగా ఈ సభ ఎంతో విజయవంతంగా జరిగిందని పేర్కొన్నారు.నాయకులందరి నిబద్ధత, కృషి వల్లనే ఇంత భారీ సభ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముగిసిందని ప్రశంసించారు. స్థానిక శాసనసభ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా అధ్యక్షుల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త సురక్షితంగా తమ ఇండ్లకు చేరుకున్నారని, ఇందుకోసం శ్రమించిన ప్రతి నాయకుని కి, కార్యకర్తకు కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ప్రతి ఒక్కరూ సభ విజయవంతం కావడానికే పని చేశారని కేటీఆర్ అభినందించారు.ఈ భారీ బహిరంగ సభను పక్కా ప్రణాళికతో, ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతం చేయగలిగామని పేర్కొన్నారు.సభ విజయవంతం కావడానికి కృషి చేసిన పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్లకు కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.వీరందరి కృషితో ఈ చారిత్రాత్మక సభ మరవలేని ఘట్టంగా నిలిచిందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.