- మధ్యంతర ఉత్తర్వులపై నేడు విచారించనున్న ధర్మాసనం.
- నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకెళ్లిన అభ్యర్ధులు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సోమవారం అప్పీలు దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ పిటీషన్ ధాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం,నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ధ్రువపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించారు.ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది.సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది సింగిల్ బెంచ్‌కు తెలిపారు.ఈ నేపథ్యంలో ఈ అంశంపై సోమవారం జరగాల్సిన విచారణను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాయిదా వేశారు.
