Take a fresh look at your lifestyle.

గొర్రెల స్కామ్​ నిందితుడు మొయినుద్దీన్ అరెస్ట్​

  • బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో విచారించిన అధికారులు.
  • కీలక సమాచారం, ఆధారాలు వెల్లడించిన నిందితుడు.
  • 14 రోజుల రిమాండ్​ విధించిన ఏసీబీ కోర్టు.
  • ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి ఓఎస్డీ, మాజీ ఎండీ, వెటర్నరీ అధికారులు సహా 17 మంది అరెస్ట్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది.ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేయగా శుక్రవారం మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.గతంలో మొయినుద్దీన్‌పై పోలీసులు లుక్​ ఔట్​ నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కేసు నమోదైన వెంటనే మొయినుద్దీన్ తన కుమారుడు ఇక్రాముద్దీన్ కలిసి దుబాయ్‌ పారిపోయాడు. కేసు నమోదు అయినప్పటి నుంచీ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఇక్రాముద్దీన్ పరారీలోనే ఉన్నారు.ఇద్దరి పాస్‌పోర్టులను అధికారులు ఇప్పటికే ఇన్పౌండ్ చేశారు.వీరిద్దరూ ‘లోలోన ది లైవ్’ అనే సంస్థ పేరుతో దళారి వ్యవహారాన్ని నడుపుతూ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.చాలా రొజుల తర్వాత శుక్రవారం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెల పంపిణీ స్కామ్‌లో మొయినుద్దీన్‌దే కీలక పాత్ర అని అధికారుల విచారణలో వెల్లడైన నేపథ్యంలో ఏసీబీ ఏం నిగ్గు తేలుస్తుందోననే ఆసక్తి నెలకొన్నది.కాగా మోయినుద్దీన్ ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కంట్రాక్టరుగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది.అలాగే ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన వారి నుంచి కీలక సమాచారం సేకరించారు.ఈ స్కాంలో రాంచందర్, కళ్యాణ్ ల పాత్ర స్పష్టమైందని తేల్చారు.వీరిద్దరు కలిసి బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో వివిధ ప్రాంతాల్లో గొర్రెలను కొనాలని రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హజరుపరచగా 14 రోజుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు విధించింది. కాగా మొత్తం రూ.1200 కోట్ల మేర అవినీతికి ఈ స్కాం దారి తీసిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్, మాజీ ఎండీ రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులు సహా 17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.