హిందూ స్మశాన వాటిక సమస్య పరిష్కరించండి -సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజిగిరి :
మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో జరుగుతున్న చెత్త డంపింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేస్తున్న నిరసనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చి అనంతరం ఒక వినతి పత్రాన్ని మల్కాజిగిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి చెత్త డంపింగ్ యార్డ్ ని హిందూ శ్మశానం నుండి మరో చోటికి తరలించడం కోసం జిల్లా యంత్రాంగం మున్సిపల్ అధికారులను పలుమార్లు ప్రత్యామ్నాయ స్థలాల కోసం కోరినప్పటికీ, అలాగే హైకోర్టు , జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు సమస్యకు సరైన పరిష్కారం లభించలేదని ఎమ్మెల్యే తెలిపారు.
దీంతో తానే స్వయంగా ముందడుగు వేసి, జేఏసి నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి పలు స్థలాలని పరిశీలించి, డైరీ ఫార్మ్ రోడ్ వద్ద మిలిటరీకి చెందిన ఖాళీ స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆ స్థలాన్ని చెత్త డంపింగ్ కోసం కేంద్ర ప్రభుత్వంతో బదలాయింపు చేసుకొని, ప్రస్తుతం స్మశానవాటికలో జరుగుతున్న చెత్త డంపింగ్‌ను పూర్తిగా నిలిపివేసి, సుమారు 50 కాలనీల ప్రజలను రక్షించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
మచ్చ బొల్లారం ప్రజలను చెత్త డంపింగ్ సమస్య నుండి విముక్తి కల్పించేందుకు అన్ని స్థాయిలలో తనవంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మచ్చ బొల్లారం జేఏసి నాయకులు, వివిధ కాలనీల ప్రతినిధులు ఎమ్మెల్యే కి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.