Take a fresh look at your lifestyle.

 సోషల్ మీడియాకు స్వీయ నియంత్రణే మేలు

ముద్ర న్యూస్ బ్యూరో :
 హైదరాబాద్, మార్చి 22: సోషల్ మీడియా నియంత్రణ పేరుతో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం పెద్ద ప్రమాదకరమని, ఈ ప్రమాదానికి ఆస్కారం ఇవ్వకూడదని, సోషల్ మీడియా స్వీయ నియంత్రణకు ఒక అసోసియేషన్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రముఖ వెబ్ సైట్ ది వైర్  వ్యవస్థాపక సంపాదకులు ఎం.కె.వేణు సూచించారు.
సోషల్ మీడియాకు స్వీయ నియంత్రణ వ్యవస్థ అవసరమన్నారు. ఈనెల 27-29 తేదీలలో’ విజయవాడలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ ప్లీనరీని పురస్కరించుకుని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూ డబ్ల్యూ జే ), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్, బషీర్  దేశోద్ధారక భవన్ “సోషల్ మీడియా – మంచీ-చెడూ ”  అనే అంశంపై ఆదివారం జాతీయ సదస్సు నిర్వ హించారు. ఈ సదస్సుకు సీనియర్ పాత్రికేయులు సోమశేఖర్ అధ్యక్షత వహించగా,  ఎం.కె.వేణు కీలకోపన్యాసం చేశారు. మెఫీ మేనేజింగ్ ట్రస్టీ, ఐజేయూ మాజీ అధ్యక్షులు డి.అమర్ స్వాగతోపన్యాసం చేశారు. టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు,కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాం నారాయణ, ఐజెయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఎ. మాజీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె. శ్రీకాంత్ రెడ్డి, వి. యాదగిరి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని కిరణ్ కుమార్ తో పాటు పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎం.కె.వేణు మాట్లాడుతూ ప్రస్తుత యుద్ధ వార్తలను సిఎన్ బిబిసి , అల్ జజీరా కంటే వేగంగా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అందుతున్నాయన్నారు. సోషల్ మీడియా రాకతో వేగం పెరిగిందని, వార్తలను వెంటనే మరింత వేగంగా అందజేసేందుకు అవకాశం లభించిందని, వార్తల శైలిలోనూ మార్పు వచ్చిందని వివరించారు.
సోషల్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫామ్ ఉపయోగపడుతుందని, ఇంటర్ రాకతో మీడియా ప్రజాస్వామీకరణ జరిగి ఏకపక్ష ఆధిపత్యానికి తెరపడిందని తెలిపారు.  నరేంద్రమోదీ ప్రధాని  కాకముందు ప్రధానమంత్రుల కార్టూన్లు కనిపించేవని,  ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. మీడియాలో ఏకఛత్రాధిపత్యం దిశగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుల పోరాటం కంటే , సమాజంలో వ్యక్తులు ఒకరితో ఒకరు చర్చించుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన పెంచుకుంటూ కొత్త స్కిల్స్  నేర్చుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఒక జర్నలిస్ట్ ఒక దగ్గర కూర్చొని చేసిన స్టోరీ క్షణాల్లో ప్రపంచం మొత్తం వెళ్తుందని, ఒకప్పుడు ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని, ఇప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్  యూట్యూబ్ లాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయని వివరించారు. యుపి ఎన్నికల్లో  సోషల్ మీడియా ద్వారా బిజెపి ప్రతి వ్యక్తికీ దగ్గరయిందన్నారు.  టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలనే అంశం తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఉన్నదని, సరైన విధానంలో తెలుసుకోకపోతే ఇబ్బందులు  తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ సోమశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రధాని మన్ కి బాత్ పేరుతో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత  ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన విషయాలు రాస్తున్నారని, మాట్లాడుతున్నారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.