ముద్ర ప్రతినిధి, నిర్మల్:
హనుమజ్జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన హనుమాన్ దేవాలయాల ముందు ఉదయం నుంచే భక్తులు దర్శనానికి తరలి వచ్చారు. ప్రధానంగా దేవరకోట సమీపంలోకి వీర హనుమాన్ దేవాలయం, బస్ డిపో సమీపంలోకి దక్షిణ ముఖి ఆంజనేయ స్వామి దేవాలయం, శాస్త్రినగర్ అభయాంజనేయ స్వామి ఆలయం, తదితర ప్రధాన ఆలయాల్లో భక్తులు తమ పూజాకార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణ ముఖి ఆంజనేయ ఆలయంలో నిర్మల్ ఎం ఎల్ ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రధాన దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేదల ఆకలి తీర్చారు.