- ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ వెలిగిపోతోంది.
- దేశ, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య భద్రత CA ల చేతుల్లోనే ఉంది.
- చార్టెడ్ అకౌంట్లకు కేంద్రంగా హైదరాబాద్.
- సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇండియా(ఐ సీ ఏ ఐ), హైదరాబాద్ శాఖల ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఏర్పాటుచేసిన సీఏ విద్యార్థుల జాతీయస్థాయి సదస్సులో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఫ్యూచర్ సిటీ, మూసి పునర్జీవం, రీజినల్ రింగ్ రోడ్డు తో పాటు అనేక పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారిందని అన్నారు.ఐటీ, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్స్ టైల్ పార్క్ వంటి వాటితో అభివృద్ధిలో ప్రపంచ పటంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుందని వివరించారు. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ దేశవ్యాప్తంగా బయటికి వస్తున్న సీఏ విద్యార్థులకు కూడా వేదికగా మీ ముందు ఉందని అన్నారు. సీఏ కోర్స్ పూర్తి చేసుకుని వస్తున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.భారతదేశ ఆర్థిక, ధన, వినియోగ నైతికతకు మూల స్తంభంగా ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇండియా (ICAI) నిలుస్తుంది అన్నారు.చార్టెడ్ అకౌంట్ టెంట్లు నైతికతకు కట్టుబడి ఉండాలని, టెక్నాలజీ ఆటోమేషన్ శరవేగంగా పెరుగుతున్న ఈ యుగంలో మీ నిజాయితీయే మీకు అత్యంత విలువైన ఆస్తి అన్నారు.మీ పని ఎల్లప్పుడూ నిజాయితీ, సమన్యాయం బాధ్యతను ప్రతిబింబించాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.1949 లో పార్లమెంటు చట్టంతో స్థాపించబడిన ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియన్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సంస్థ ఆర్థిక క్రమశిక్షణ, వృత్తిపరమైన విలువలు, ప్రజల నమ్మకానికి ఒక నిలువెత్తు నిదర్శనం అన్నారు. దేశవ్యాప్తంగా 4.26 లక్షలకు పైగా సభ్యులు, దాదాపు పది లక్షల మంది విద్యార్థులతో మీరు ఒక బలమైన ఆర్థిక శక్తిగా మారారని భట్టివిక్రమార్క అభివర్ణించారు.ఇందులో హైదరాబాద్ బ్రాంచ్ పాత్ర మరింత విశిష్టమైనది 14,500 మందికి పైగా సభ్యులు, 31,000 మందికిపైగా విద్యార్థులతో ఇది ఐసిఏఐకి విలువైన ఆభరణంగా నిలిచిందన్నారు. మీరు కేవలం అంకెలు, సంఖ్యలు కాదు ఒక శక్తి, ఒక ఆశయం, ఒక ప్రతిభకు ప్రతీక అన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ కావడం అంటే పరీక్షలు పాస్ కావడమే కాదని.. ఇది నిరంతర అభ్యాసం, అనుభవం, వ్యక్తిత్వ వికాసాన్ని కలగలిపిన ఒక ప్రయాణమన్నారు. ఆర్థిక మంత్రిగా సీఏ ల వృత్తిపరమైన ప్రభావాన్ని ప్రతిరోజు చూస్తుంటానని చార్టెడ్ అకౌంట్ లు కేవలం అంకెలు, సంఖ్యలు చూసేందుకే పరిమితం కారని చెప్పారు.నిబంధనలకు కట్టుబడి ఉండేలా, ప్రమాణాలను పాటిస్తూ సంక్లిష్టతకు స్పష్టత తీసుకొస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా సేవలందించే ప్రతిభావంతులైన వృత్తి నిపుణులను ఐసిఏఐ తయారు చేయడం మనందరికీ గర్వకారణం అన్నారు. సీఏ విద్యార్థులు కేవలం ఒక ఉద్యోగం కోసం సిద్ధం కావడం లేదన్నారు. భవిష్యత్తులో వ్యాపారాలు, సంస్థలు, ప్రభుత్వాల ఆర్థిక ఆరోగ్యానికి బాధ్యత వహించేందుకు వారు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ బాధ్యతలు బ్యాలెన్స్ సీట్లకే పరిమితం కావని, అభివృద్ధికి భాగస్వాములని, ప్రజల నమ్మకానికి రక్షకులు అని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.ఈరోజు భారతదేశము ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న సమయంలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.బిజినెస్ రిఫార్మ్స్, స్టార్టప్ లకు చేయూత, ప్రజా ఆర్థిక వ్యవస్థల బలోపేతం ఇవన్నీ సీఏ ల పాత్రతోనే ముందుకు సాగుతాయన్నారు.బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో కూడిన అకౌంటింగ్, డిజిటల్ పన్నుల వంటి అంశాల్లో పరిణామాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.ఈ నేపథ్యంలో సమకాలీన పరిజ్ఞానాన్ని మెరుగు పరుచుకోవాలని డిప్యూటీ సీఎం సీఏ విద్యార్థులకు సూచించారు.మీ ప్రతిభను కేవలం సంపాదనకే కాకుండా సేవకు వినియోగించాలి, సోషల్ ఆడిట్లు చేయండి, చిన్న వ్యాపారాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని, ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక కార్యక్రమాలలో పాల్గొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆశించారు.మీలో చాలామంది భవిష్యత్తులో సొంత సంస్థలు స్థాపిస్తారు మీరు ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగ దాతలుగా మారాలని కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని సీఏ విద్యార్థులకు పిలుపునిచ్చారు.కష్టపడి సాధించాల్సిన ఉన్నత మార్గాన్ని ఎంచుకున్నందుకు సిఏ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సీఏ ప్రయాణం అంత సులభమైనది కాదు కానీ ఎంతో సార్ధకమయింది, మీ విజయం కేవలం మీకు మాత్రమే చెందదు అది భారతదేశ పురోగతికి చేయూతనిస్తుందని, గొప్ప వృత్తి గౌరవాన్ని ఎప్పటికీ నిలబెట్టాలని తాను కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
